యూరియా అమ్మకాలపై బ్యాన్ ఎందుకు?
- ఇది ముమ్మాటికి రైతు వ్యతిరేక చర్యనే
- రైతుల ఇబ్బందులు ప్రభుత్వానికి కనిపించడంలేదా?
- బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడం దిక్కుమాలిన చర్య అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ ఇలాంటి నిషేధం విధించిన దాఖలాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూరియా అమ్మకాలపై నిషేధం మొదలైందని మండిపడ్డారు. యూరియా అమ్మకాలు నిలిపి వేస్తూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూరియా కోసం రైతులు తిరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తునదని నిలదీశారు. యూరియా అమ్మకాలు నిలిపివేయడంతో చెరకు, పండ్ల తోటలు, కూరగాయలు పండించే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటే ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాల్సింది పోయి, ఎరువుల కష్టాలను మరింత ఎక్కువ చేసేలా రూపొందించిన యాప్ రైతుల పాలిట శాపం గా మారిందని హరీష్‌రావు విమర్శించారు.
యూరియా సరఫరాపై దృష్టి సారించడం మానేసి, యూరియా వినియోగం తగ్గించాలంటూ రైతులకు చెప్పడం, డబ్బులు వెచ్చించి ప్రచారం చేయడం హాస్యాస్పదమన్నారు. ధాన్యం కొనుగోళ్లలో దారుణంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల ఒకవైపు రైతులు తీవ్ర ఆందోళనలో ఉంటే ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహిస్తుండటం వారిని అవమానించడమేనని వ్యాఖ్యానించారు.
ఈ ప్రభుత్వం ‘రైతు బంధు ఇవ్వడంలో, బోనస్ చెల్లించడంలో, పంట బీమా పథకం అమలులో, రుణమాఫీ చేయడంలో, యూరి యా సరఫరాలో, పంట కొనుగోళ్లు చేయడంలో, కొన్న పంటకు బోనస్ పైసలు ఇవ్వ డం’లో ఫెయిల్ అయిందన్నారు. ఈ వైఫ్యల్యాలను కవర్ చేసుకోవడానికి వారోత్సవాల పేరిట డ్రామా చేసినంత మాత్రాన రైతుల ఉసురు తీసుకుంటున్న పాపం రేవంత్ రెడ్డికి తగలకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాం లో వలే నిరంతరం యూరియా అమ్మకాలు కొనసాగించాలని, అనధికారిక బ్యాన్‌ను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.






