నా తండ్రి చేసిన ఆరోపణలు అవాస్తవాలు : మంచు మనోజ్
హైదరాబాద్,(విజయక్రాంతి): సినీనటుడు మోహన్ బాబు ఆరోపణలపై మంచు మనోజ్ ఎక్స్ లో వివరణ ఇస్తూ పోస్టు చేశారు. తన తండ్రి చేసిన ఆరోపణలు చాలా బాధ కలిగించాయని, తనను, ఆయన భార్య మౌనికను ఇరికించే ఉద్దేశంతోనే పోలీస్ స్టేషన్ లో తన తండ్రి మోహన్ బాబు ఫిర్యాదు చేశారని ఆరోపించారు. 4 నెలల క్రితం దురుద్దేశపూర్వకంగా వెళ్లానని, ఆరోపణలు పూర్తిగా కల్పితామన్నారు. తాము స్వయం ఉపాధి పొందుతూ స్వతంత్రంగా ఉన్నామని, తానెప్పుడు ఆర్థిక సాయం కోసం మంచు కుటుంబంపై ఆధారపడలేదని చెప్పారు.
మంచు విష్ణు దుబాయ్ వెళ్లాక అమ్మ ఒంటరిగా ఉందని తనను ఇంటికి రమ్మని మోహన్ బాబు పిలిచారన్నారు. దీంతో తను ఏడాది నుంచి మా నాన్న ఇంట్లో ఉంటున్నాని, కావాలంటే ఫోన్ టవర్ లొకేషన్ ద్రవీకరించాలని అధికారులను అభర్ధించారు. మనోజ్ ఏడు నెలల కుమార్తెను కుటుంబ వివాదంలోకి లాగడం అమానవీయం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో పనివారూ నాన్న దుర్భాషలతో భయపడతారని, అన్ని ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
తనకు తగిలిన గాయాలకు చికిత్స కోసమే ఆసుపత్రికి వెళ్లానని, విష్ణు సహచరులు విజయ్, కిరణ్ సీసీటీవీ డ్రైవ్ లు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఏం దాచడానికి యత్నిస్తున్నారో సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులను మనోజ్ కోరారు. తనెప్పుడు వారసత్వపు ఆస్తుల కోసం అడగలేదని, ఆస్తులు అడిగి ఉంటే సాక్ష్యాలు ఇవ్వాలని సవాల్ చేశారు. ఎంబీయూ విద్యార్ధులు విష్ణు సహచరులు వినయ్, మహేశ్వర్ ద్వారా దోపిడికి గురవుతున్నారన్నారు. వారు సంపాదించిన ఆర్థిక అక్రమాలు, దోపిడికి సంబంధించిన ఆధారాలను అధికారులకు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు మంచు మనోజ్ పేర్కొన్నారు.






