30 March, 2026 | 4:41 PM

ఏపీ డీజీపీ ముందు లొంగిపోయిన మావోయిస్టులు

30-03-2026 03:08 PM

విజయవాడ: 2018 సెప్టెంబర్ 23న అరకులో టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమేశ్వరరావు కాల్చివేతకు గురైన ఘటనలో పాల్గొన్న సీనియర్ మావోయిస్టు నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు అయిన చెల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్ సోమవారం ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా (CCM), ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీ (AOBSZC) కార్యదర్శిగా వ్యవహరించిన నారాయణరావు సీపీఐ మావోయిస్టులో సుమారు 36 ఏళ్ల పాటు పనిచేశారు.

ఆయన శ్రీకాకుళం జిల్లా, వజ్రపుకొత్తూరు మండలం పరిధిలోని పెదవెంక గ్రామానికి చెందినవారు. సుమారు 1990 నవంబరులో, ఆయన విప్లవ భావజాలం పట్ల ఆకర్షితులై 'పీపుల్స్ వార్ గ్రూపు'లో చేరారు. 2003లో ఆయన ఉప-మండల కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది, రాష్ట్ర సైనిక కమిషన్ (SMC)లో సభ్యుడిగా బదిలీ అయ్యారు. ఒక సంవత్సరం తర్వాత, ఆయన కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. దేశంలో ఉన్న మావోయిస్టులు అందరూ జనజీవన శ్రవంతిలో కలవాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మార్చి 31 వరకు డెడ్ లైన్ పెట్టిన విషయం తెలిసిందే.

"మార్చి 31 నాటికి నక్సల్ రహిత దేశం అనే జాతీయ లక్ష్యానికి అనుగుణంగా మేము ఈ మిషన్‌ను చేపట్టాము. నేడు ఏపీ నక్సల్ రహిత రాష్ట్రంగా మారిందని చెప్పవచ్చు. ఈ రోజు 30వ తేదీ కావడంతో, చివరి కార్డర్లు మా ముందు ఉన్నారు. వారిలో సీసీఎం, బోర్డ్ ఆఫ్ కమిటీ కార్యదర్శి అయిన సురేష్‌తో సహా 9 మంది కార్డర్లు లొంగిపోయారు. గత ఒకటిన్నర సంవత్సర కాలంలో అనేక కాల్పుల మార్పిడి, లొంగిపోవడాలు, అరెస్టులు కూడా జరిగాయి." అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు.