నేటికీ మౌన రోదనలో ఇంద్రవెల్లి
నేడు అమరవీరుల సంస్మరణ సభ
ఉట్నూర్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ఇంద్రవెల్లి అమరవీరులకు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న ఇంద్రవెల్లి మండలంలోని మారుమూల గ్రామాల్లో ఏప్రిల్ 20 వచ్చిందంటే ఆనాటి సంఘటనలో కుటుంబ పెద్దలను కోల్పోయిన గిరిజనులు మౌనంగా రోదిస్తున్నారు.
1981 ఏప్రిల్ 20న జరిగిన సంఘటనలో పోలీస్ కాల్పులలో 13 మంది మృతి చెందినట్లు ఆనా టి ప్రభుత్వం ప్రకటించింది. పోలీస్ కాల్పుల్లో తీవ్ర గాయాలై చెట్టు పుట్ట.. వాగులు వంకలు.. చేను చిలక దాటుతూ.. గూడాలు చేరుకొని ప్రాణాలర్పించిన వారు ఎందరో ఉన్నారు. ప్రభుత్వం గుర్తించని అమరుల పేర్లను తలుచుకొని నేటికీ ఆ కుటుంబాలు మౌనంగానే రోదిస్తున్నాయి.
క్షతగాత్రులైన వారిని సైతం ప్రభుత్వం పట్టించకపోవడంతో ఆ కుటుంబాలు సైతం నేటికీ మౌనంగానే రోదిస్తు న్నాయి.. ఏప్రిల్ నెల వచ్చిందంటే నేటికీ ఆదివాసిగూడలో గుబులు గుబులుగా జీవనం సాగించే కుటుంబాలు చాలా వరకు ఉన్నాయి. నాలుగు దశాబ్దాలు దాటిన నేటికీ చెరగని ముద్రగానే ఉంది..
అమరుల కుటుంబాలను ఆదుకున్న మాజీ ఎంపీ సోయం..
1981 ఏప్రిల్ 20న పోలీస్ కాల్పుల్లో అమరులైన గిరిజనుల కుటుంబాలతో పాటు క్షతగాత్రులైన కుటుంబాలను మాజీ ఎంపీ, రాజ్ గోండు సేవా సమితి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోయం బాపూరావు వారిని గుర్తించి వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. సోయం బాపూరావు ఎంపికైన రెండవ సంవత్సరం అమరవీరుల దినోత్సవం రోజున ఇంద్రవెల్లి అమరులకు నివాళులు అర్పించిన అనంతరం వారి కుటుంబాలకు, ఒక్కొక్క కుటుంబానికి పది వేల రూపాయలు నగదుగా అందజేశారు..
2005లో బోథ్ ఎమ్మెల్యేగా సోయం బాపూరావు విజయం సాధించిన రోజు రాత్రి 11:30 గంటలకు ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్దకు చేరుకొని ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించారు. ఎమ్మెల్యేగా సోయం బాపూరావు నివాళులు అర్పిం చిన తర్వాత నుండి కొన్ని ఆంక్షలుతో అమరులకు నివాళులర్పించేందుకు అప్పటి ప్రభుత్వం అనుమతించింది.
కాల్పుల అనంతరం చనిపోయారు
ఇంద్రవెల్లిలో జరిగిన పోలీస్ కాల్పుల్లో తన భర్త కినక రాము కు పోలీసు తూట తగిలింది. కుడి తొడ గాయంతో పరుగులు తీసి ఇంటికి చేరుకున్నారు. నాటు వైద్యంతో గాయం నయమైన తొడలో ఉన్న తూటా వల్ల రెండేళ్లకు మృతి చెందాడు. అప్పటినుండి మా కుటుంబం వైపు ప్రభుత్వ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. ప్రజా ప్రభుత్వం అమరుల కుటుంబాల్ని ఆదుకుంది. తన భర్త ప్రభుత్వ లెక్కల లో చూపించలేదు. మా కుటుంబానికి ప్రభుత్వ పరంగా సహాయం రాలేదు. ఇందిరమ్మ ఇల్లు సైతం మంజూరు చేయలేదు. గుడిసెల్లో జీవనం సాగిస్తున్న. ఇప్పటికైనా ప్రభుత్వం మా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నా.
కినక జైతుబాయి, కన్నాపూర్, సిరికొండ మండలం






