31 March, 2026 | 3:16 AM

కరెన్సీ భారీ పతనం

31-03-2026 01:35 AM

డాలర్ మారకంతో 95 స్థాయికి పడిపోయిన రూపాయి

ముంబై, మార్చి 30: రూపాయి విలువ మరింత పడిపోయింది. ఆర్‌బీఐ జోక్యం చేసుకున్నప్పటికీ అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి తొలిసారిగా 95 మార్కును దాటింది. ప్రపంచ కారకాలు, నిరంతర విదేశీ నిధులు తరలింపుల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉండడంతో రూపాయి రోజులో 0.3 శాతం తగ్గి డాలర్‌కు 95.20 వద్ద రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోయింది. సోమవారం డాలర్ మారకంతో ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని తాకింది. అంతర్జాతీయ పరిణామాలతో రూపాయి రోజురోజు నష్టపోతోంది. డాలర్ మారకంతో 95.14 వద్ద కనిష్ఠస్థాయికి పడిపోయింది.

రూపాయి 95 స్థాయికి పడిపోవడం ఇది మొదటిసారి. గతవారం కనిష్ఠస్థాయికి పడిపోయిన రూపాయి ఈరోజు ఉదయం కాస్త కోలుకుంది. ఈరోజు ప్రారంభంలో 130 పైసలు లాభపడి 93.59 వద్ద ప్రారంభమైంది. కానీ సెషన్ ముగిసేసరికి ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరుకుంది.రూపాయి బలహీనతకు ఎన్నో కారణాలు ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యాలెర్‌కు 109 డాలర్లకు పైన ఉంది. దీనితో విదేశీ పెట్టుబడిదారులు దేశీయ మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నారు.

ఈ నెలలో విదేశీ పెట్టుబడిదారులు దేశీయ మార్కెట్ల నుంచి సుమారు 115 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. గత శుక్రవారం సుమారు రూ.850 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను విదేశీ పెట్టుబడిదారులు విక్రయించారు. ఇలా వివిధ కారణాలతో రూపాయి అత్యంత బలహీనమవుతోంది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటున్నా క్షీణత ఆగకపోవడం గమనార్హం. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు మన కరెన్సీపై తీవ్రంగా ఒత్తిడి పెంచుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి రూపాయి దాదాపు 4.1 శాతం క్షీణించింది.