ములుగులో భారీ ఎన్‌కౌంటర్..
ఏడుగురు మావోయిస్టులు హతం
- తెలంగాణలో రెండో భారీ ఎన్‌కౌంటర్
- ఆగస్టు 5న మోతె అడవుల్లో ఎదురుకాల్పులు
- తాజాగా చల్పాక అటవీ ప్రాంతంలో..
- పీఎల్‌జీఏ వారోత్సవాల ముందురోజు కలకలం
భద్రాద్రి కొత్తగూడెం/జనగామ, డిసెంబర్ 1 (విజయక్రాంతి): తెలంగాణలో మరోమారు తుపాకుల మోత మోగింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతం అయ్యారు. గత 4 నెలల కాలంలో తెలంగాణలో ఇది రెండో భారీ ఎన్‌కౌంటర్.
దేశవ్యాప్తంగా పీఎల్‌జీఏ వారోత్సవాలకు మావోయిస్టులు సిద్ధమవుతున్న వేళ భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ఇటీవల ములుగు జిల్లాలో ఓ గ్రామపంచాయతీ కార్యదర్శితోపాటు అతడి సోదరుడిని పోలీస్ ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో పోలీసులు భారీగా కూంబింగ్ చేపట్టారు.
ఆదివారం తెల్లవారుజామున ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక వద్ద పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరువర్గాలు కాల్పులకు దిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో దళ కమాండర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు భద్రు, ఏటూరునాగారం, మహదేవ్‌పూర్ ఏరియా కమాండర్ ఈగోలపు మల్లయ్య, దళ నాయకులు ముస్సాకి దేవల్, ముస్సాకి జమున, జైసింగ్, కిశోర్, కామేశ్ మృతిచెందినట్టు పోలీసులు గుర్తించారు.
వీరివద్ద పోలీసులు ఏకే ౪౭లతోపాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు, యాంటీ మావోయిస్టు స్కాడ్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని ములుగు ఎస్పీ శబరీష్ పరిశీలించారు.
సరిగ్గా ౪ నెలల క్రితం ఆగస్టు 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మోతె ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టు మృతిచెందిన విషయం విధితమే.
ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రంలోకి..
ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న వరుస ఎన్‌కౌంటర్‌లతో మావోయిస్టులు భీతిల్లుతున్నారు. పోలీసులు అవలంబిస్తున్న ఆపరేషన్ కగార్ విధానాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకవైపు మావోయిస్టులు అమరవీరుల సంస్మరణ సభలు ఈ నెల 2 నుంచి 8 వరకు పీఎల్‌జీఏ వారోత్సవాలకు సన్నద్ధమవుతుండగా మరోవైపు పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నారు.
ఈ క్రమంలో మావోయిస్టులు తెలంగాణలోని గోదావరి పరీవాహక ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నారు. వీరి రాకపై పక్కా సమాచారం ఉంటున్న పోలీసులు ఎక్కడికక్కడ మట్టుబెడుతున్నారు. పోలీసుల కూంబింగ్, ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో ఏక్షణంలో ఏమి జరుగుతుందోనని ఏజెన్సీ వాసులు బిక్కుబిక్కుమంటు జీవనం సాగిస్తున్నారు.




