6 April, 2026 | 9:29 AM

సీఎంఆర్‌ఎఫ్ 830 కోట్లు

02-12-2024 02:54 AM
  1. కాంగ్రెస్ ఏడాది పాలనలో 1.66 లక్షల కుటుంబాలకు లబ్ధి 
  2. రికార్డుస్థాయిలో 13వేల మందికి ఎల్‌వోసీలు జారీ
  3. కాంగ్రెస్ వచ్చాక కీలక మార్పు
  4. పారదర్శకతకు ఆన్‌లైన్ విధానం

హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): ఆరోగ్యపరంగా ఆపదలో ఉన్నవారి ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తన ఔదార్యాన్ని చాటుకుంది. ఒకవైపు అవకతవకలకు చెక్ పెడుతూనే మరోవైపు పేదలకు అత్యవసర వైద్య చికిత్సను అందించేందుకు ముఖ్యమంత్రి సీఎం సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) స్కీమ్ ద్వారా నేనున్నానంటూ అంటూ సాయం చేసేందుకు ముందుకొచ్చింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన లో 1.66 లక్షల కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ పథకం ద్వారా ఆపన్నహస్తాన్ని అందించింది. తద్వారా ఏడాదిలోనే రూ.830 కోట్ల సాయాన్ని అందజేసి రికార్డు సృష్టించింది. వాస్తవానికి 2018 నుంచి 2023 వరకు అంటే ఐదేళ్లలో నాటి సర్కారు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2,400 కోట్ల సాయం అందించింది.

అంటే.. ఏడాదికి సగటున రూ.480 కోట్లు ఖర్చు పెట్టింది అన్న మాట. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే సీఎంఆర్‌ఎఫ్, ఎల్‌ఓసీలు కలిపి మొత్తం రూ.830 కోట్లను నిరుపేదలకు అందజేసింది. ఈ నిధులతో రాష్ట్రంలోని 1,66,000 పేద, మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధి చేకూరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

వేగంగా ఎల్‌వోసీలు జారీ.. 

ఈ ఏడాది ప్రభుత్వం విడుదల చేసిన రూ.830 కోట్లలో రూ.590 కోట్లు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సాయం అందించినవి ఉన్నాయి. మిగతా రూ. 240 కోట్లు ఎల్‌వోసీల రూపంలో ప్రభుత్వం మంజూరు చేసింది. కొన్ని ప్రాణాంతక వ్యాధులకు పెద్దపెద్ద ఆస్పత్రుల్లో చికిత్స చేయాల్సి ఉంటుంది.

ఖరీదైన వైద్యం చేయించుకునే స్థోమత లేక ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో ముందుగానే  సీఎం సహాయ నిధిని పేదలు ఆశ్రయిస్తారు. అలాంటి సందర్భాల్లో  నిమ్స్, నిలోఫర్, ఈఎన్‌టీ, ఉస్మానియా, గాంధీ లాంటి ఆసుపత్రుల్లో చికిత్సలకు అయ్యే అంచనా ఖర్చును సర్కారే భరిస్తుంది.

సీఎం సహాయ నిధి నుంచి సంబంధిత ఆసుపత్రికి ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)ని జారీ చేస్తుంది. ఈ ఎల్‌వోసీల జారీలోనూ ప్రభుత్వం వేగంగా స్పందించినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాదిలోనే 13 వేల మందికి ఎల్‌వోసీలు జారీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.  ప్రభుత్వం ఈ ఏడాది జారీ చేసిన ఎల్‌ఓసీ విలువ రూ.240 కోట్లు కావడం గమనార్హం.

పథకంలో కీలక మార్పులు.. 

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంఆర్‌ఎఫ్‌లో కీలక మార్పులు మార్పులు చేసింది. ముఖ్యంగా చిన్నారుల పాలిట ఈ స్కీమ్‌ను వరంగా మార్చింది. ఈ ఏడాది అత్యధికంగా ఎల్‌ఓసీలు పొందిన వారిలో చిన్న పిల్లలు ఉండటం గమనార్హం. చిన్నారులకు ఆపరేషన్లు, చికిత్సలకు సంబంధించిన దరఖాస్తులు వస్తే వేగంగా జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ప్రత్యేకంగా ఆదేశించారు. అందుకే దరఖాస్తు వచ్చిన 24 గంటల్లోనే ఎల్‌ఓసీని జారీ చేసే ఏర్పాట్లు చేసింది.

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంఆర్‌ఎఫ్ నిధుల అవకతవకలపై కూడా ఫోకస్ పెట్టింది. కొందరు అక్రమార్కులు దొంగ బిల్లులు సృష్టించి సీఎంఆర్‌ఎఫ్ నిధులను దోచుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసింది. అందుకే సీఎంఆర్‌ఎఫ్‌లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చింది.

పారదర్శకంగా ఉండేందుకు సీఎంఆర్‌ఎఫ్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లోకి చేసుకునే అవకాశాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా దళారుల ప్రమేయం లేకుండా చేసింది. దీంతో ఎవరి ప్రమేయం లేకుండానే నేరుగా దరఖాస్తుదారులే తమ సీఎంఆర్‌ఎఫ్ స్టేటస్‌ను తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది.

సీఎంఆర్‌ఎఫ్ నిధుల అవకతవకల్లో హాస్పిటల్స్ ప్రమేయం ఉందని గ్రహించిన ప్రభుత్వం ఆస్పత్రుల వెరిఫికేషన్ ప్రక్రియను మరింత కఠినతరం చేసింది. అంతేకాకుండా గతంలో కొందరు ప్రజాప్రతినిధుల ఆఫీసుల్లో పనిచేసిన సిబ్బంది సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను తమ ఖాతాల్లో వేసుకున్న ఉదంతాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఈ ప్రభుత్వం అలాంటి దోపిడీకి అవకాశం లేకుండా చెక్కులపై లబ్ధిదారుల పేర్లతో పాటు వారి బ్యాంక్ ఖాతా నంబర్‌ను ప్రభుత్వం ముద్రిస్తోంది. 

మూగ, చెవుడు పిల్లలకు ఎంత ఖర్చయినా.. 

పుట్టుకతోనే ఈఎన్‌టీ(మూగ, చెవుడు) సమస్య ఉన్న పిల్లల పాలిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక ఉదారతను కనబర్చింది. ఆ చిన్నారులు జీవితాంతం ఇబ్బంది పడకుండా ఉండేందుకు, వారికి అవసరమైన చికిత్స చేసేందుకు ముందుకొచ్చింది. చెవిటి, మూగ పిల్లలు ఉండకూడదని, ఆపరేషన్ చేస్తే.. బాగు అవుతుంది అనుకుంటే, ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

అవకాశం ఉన్న పిల్లలకు శస్త్ర చికిత్సలు చేయాలని ఆదేశించారు. అలా ఏడాదికాలంలో ఇప్పటివరకు సుమారు 87 మంది పిల్లలకు ఎల్‌వోసీ ఇచ్చి ఆపరేషన్లు చేయించారు. తమ పిల్లలకు రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వం పునర్జన్మ ఇచ్చిందని తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.