‘పీఎంజే’ దోపీడీ సూత్రధారి అరెస్ట్
- కరీంనగర్ పోలీసుల అదుపులో సుభోధ్ సింగ్
- బీహార్‌లోని ఆరు కోర్టుల పీటీ వారెంట్లతో బీహార్ జైలు నుంచి కరీంనగర్‌కు తరలింపు
- వెల్లడించిన సీపీ గౌస్ ఆలం
కరీంనగర్ క్రైం, మే 29 (విజయక్రాంతి): ఈ నెల 3న కరీంనగర్ పట్టణంలోని పీఎంజే జ్యువెలరీలో పనిచేసే ఉద్యోగులపై కాల్పులు జరిపి, దోపిడీకి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు, సూత్రధారి అయిన సుభోధ్ సింగ్‌ను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా జైలు నుంచి పీటీ వారెంట్‌పై సుబోధ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఈ కేసుతో పాటు ఇతర కేసుల్లోనూ నిందితుడిగా ఉన్న సుభోధ్ సింగ్‌పై వివిధ కోర్టుల్లో నమోదైన కేసుల నేపథ్యంలో, మొత్తం ఆరు కోర్టుల పరిధిలో పీటీ వారెంట్లకు అనుమతులు పొందిన అనంతరం కస్టడీలోకి తీసుకుని కరీంనగర్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. సుభోధ్ సింగ్‌ను ప్రత్యేక పోలీసు బృందం గురువారం రాత్రి కరీంనగర్‌కు తీసుకొచ్చారు.
అర్ధరాత్రి నిందితుడిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు తెలిపారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించినట్లు వెల్లడించారు. కేసుకు సంబంధించిన అంశాలపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు, నిందితుడిని వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరుతూ కరీంనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సీపీ తెలిపారు.






