గ్రామదేవతల దీవెనలు అందరిపై ఉండాలె
గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
జయశంకర్ భూపాలపల్లి, మే 22 (విజయక్రాంతి): గ్రామ దేవతల దీవెనలు, ఆశీ స్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆకాక్షించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల బొడ్రాయి మారుకొలుపు, కాటా రం మండలం గుమ్మళ్ళపల్లి గ్రామాల్లో జరిగిన బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. తాడిచెర్ల జెన్కో ఓపెన్ కాస్ట్ డేంజర్ జోన్ పరిధిలోని నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. మల్లారం సెంటర్, తాడిచెర్ల నుంచి ఖమ్మంపల్లి బ్రిడ్జి వరకు రోడ్డు వెడల్పు చేసి సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాశ్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దండు రమేశ్, జడ్పీటీసీ ఐత కోమల రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బడితెల రాజయ్య, కొండ రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.






