ఎంబీబీఎస్ X డిగ్రీ
- ఎటూ తేల్చుకోలేకపోతున్న నీట్ ఉత్తీర్ణులు
కౌన్సిలింగ్‌పై స్పష్టత లేకపోవడంతో అయోమయం
తుదిదశకు డిగ్రీ మూడో విడుత సీట్ల కేటాయింపు
గందరగోళంలో నీట్ అభ్యర్థులు
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): ఎన్నో ఆశలు, కలలతో వైద్య విద్యను పూర్తి చేయాలనుకునే విద్యార్థుల ఆశలు అడియాశలవుతున్నాయి. నీట్ పేపర్ లీక్‌తో ఇప్పుడు నీట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారా? లేదా? నీట్‌ను రద్దు చేస్తారా? కొనసాగిస్తారా? అనే దానిపై స్పష్టత రాకపోవడంతో ఏ కోర్సును ఎంచుకోవాలో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం నీట్ పేపర్ లీకేజీ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది.
దీనిపై తుది నిర్ణయం వెలువడేంత వరకు వేచి చూసి ఆ తర్వాత నీట్ కౌన్సిలింగ్ ద్వారా వైద్య విద్యను అభ్యసించాలా లేకపోతే ప్రస్తుతం డిగ్రీలో జాయిన్ కావాలో తెలియక విద్యార్థులు సందిగ్ధంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు డిగ్రీ సీట్లను భర్తీ చేసే దోస్త్ మూడో విడత సీట్ల రిజిస్ట్రేషన్ల గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఎటు వైపు వెళ్లాలో తేల్చుకోలేని ఆందోళనలో నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఉన్నారు.
ఎటు వెళ్లాలి?
నీట్ పరీక్ష అంతా సాఫీగా జరిగి ఉంటే ఇప్పటికే కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండేది. నీట్ పేపర్ లీకైన నేపథ్యంలో నీట్ ఉంటుందా? రద్దు చేసి వేరేది నిర్వహిస్తారా? లేకపోతే దీన్నే కొనసాగిస్తారా? అనేదానిపై స్పష్టత ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనబడట్లేదు. దీంతో విద్యా సంవత్సరాన్ని వృథా చేసుకోవడం కంటే డిగ్రీ, ఫార్మసీ, ఇతర కోర్సుల్లో జాయిన్ కావాలో తెలియక వారు సతమతమవుతున్నారు. ఈ సంవత్సరం నీట్‌కు 24,06,079 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఇందులో 23,33,297 మంది హాజరవగా, 13,16,268 మంది విద్యార్థులు అర్హత సాధించారు. తెలంగాణ నుంచి 79,813 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 77,849 మంది పరీక్షను రాస్తే 47,371 మంది అర్హత సాధించారు. ఒకవేళ నీట్‌లో సీటు రాకుంటే ఇందులో అర్హత సాధించిన వారు వైద్య విద్యకు అనుబంధంగా ఉండే డిగ్రీ కోర్సులైన డీఫార్మసీ, లైఫ్ సైన్సెస్ కోర్సుల్లో జాయిన్ అవుతుంటారు. ఈ కోర్సుల్లో జాయిన్ కావాలంటే దోస్త్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటికే దోస్త్ కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలై రెండో విడుత సీట్లను కూడా కేటయించారు. మూడో విడుత రిజస్ట్రేషన్ ప్రక్రియ సైతం చివరి దశకు చేరింది. జూలై 2తో ఆ గడువు కాస్త ముగియనుంది. జూలై 6న మూడో విడుత సీట్లను విద్యార్థులకు కేటాయిస్తారు. ఈ క్రమంలో నీట్‌పై స్పష్టత కొరవడడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు.
వైద్య విద్యకు యమ క్రేజ్
వైద్య విద్య అంటే విద్యార్థులకు యమ క్రేజ్ ఉంది. నీట్ ద్వారా ఎంబీబీఎస్, డెంటల్, ఆయుష్, వెటర్నరీ, నర్సింగ్, ఇతర వైద్య, పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలను నీట్ ద్వారా కల్పిస్తారు. వైద్య విద్యను పూర్తి చేస్తే జీవితంలో బాగా స్థిరపడటంతోపాటు, ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కుతుందనే ఉద్దేశంతో ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటర్ తర్వాత నీట్ పరీక్షను రాయిస్తుంటారు. ఇందుకు హైస్కూల్, ఇంటర్ నుంచే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్)కోసం శిక్షణను ఇప్పిస్తుంటారు. ఖర్చుకు వెనుకాడకుండా కోచింగ్ సెటర్లలో చేర్పిస్తుంటారు.






