ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి బడ్జెట్‌లో అరకొరగా రూ.45 కోట్లు
- బోధన సిబ్బంది నియామకం నిల్
అడ్మిషన్ల కోసం మొగ్గు చూపని విద్యార్థులు
యూనివర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వం చొరవ చూపాలి
మైనారిటీ సంఘం రాష్ట్ర అద్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 22 ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని డా. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్శిటీకి ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అరకొరగా రూ. 45 కోట్లు నిధులు కేటాయించిందని మైనారిటీ సంఘం రాష్ట్ర అద్యక్షుడు ఎండి. యాకుబ్ పాషా ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్థాపించిన డా. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రస్తుతం లక్ష్యాల దిశగా ముందుకు సాగడంలో విఫలమవుతోందని విమర్శించారు.
ఈ ఏడాది సుమారు రూ.45 కోట్ల వ్యయం కేటాయించినప్పటికి అవి అరకోరగా మాత్రమే సరిపోతాయన్నారు. యూనివర్సిటీ ప్రగతి, మౌలిక సదుపాయాల అభివృద్ధి పూర్తిస్థాయిలో జరగకపోవడం, బోధనా సిబ్బంది నియామకాలు లేకపోవడం, విద్యార్థుల ప్రవేశాలపై నిరుత్సాహకర పరిస్థితులు నెలకొనడం వంటి అంశాలు ఈ యూనివర్సిటీ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రత్యేకంగా, బోధన సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవడం వల్ల విద్యా ప్రమాణాలపై ప్రభావం పడుతోందన్నారు.
యూనివర్సిటీలో 54 మంది సిబ్బంది అవసరం కాగా నేటి వరకు ఒక్కరిని కూడా నియమించకపోవటం విస్మయాన్ని కలిగిస్తుందని, ఇదే సందర్బంలో సరైన ఫ్యాకల్టీ లేకపోవడంతో విద్యార్థులలో నమ్మకాన్ని దెబ్బతీస్తుందన్నారు. గత ఏడాది బి. ఎస్సీ జియాలజీ, ఎన్విరాన్ మెంటల్ సైన్స్ లలో 120 సీట్లు ఉండగా , కేవలం 51 మంది విద్యార్దులు మాత్రమే ప్రవేశాలు పొందారని, అదేవిధంగా ఎం.ఎస్సీ జియాలజి, ఎం.ఎస్సీ ఎన్విరాన్ మెంటల్ సైన్స్ లలో 80 సీట్లకు గాను కేవలం 11 మంది విద్యార్దులు మాత్రమే అడ్మిషన్లు పొందారని ఆవేదన వ్యక్తం చేశారు.
యూనివర్సిటీ వర్గాలు రూ. 300 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపగా కేవలం రూ.45 కోట్లు మంజూరు చెయ్యటం శోచనీయమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి డా. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి ఇతర యూనివర్సిటీలకు నిధులు మంజూరు చేసే విధంగా నిధులు పెంచి యూనివర్సిటీ అభివృద్ధికి దోహదపడాలని కోరారు.




