విజృంభిస్తున్న మీజిల్స్, రూబెల్లా..!
రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్య
చిన్నారుల్లో వ్యాక్సినేషన్‌పై కొరవడిన పర్యవేక్షణ
పట్టించుకోని అధికారులు
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 13 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో మీజిల్స్ రూబెల్లా (అమ్మతల్లి - తట్టు) వ్యాధులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ వ్యాధి లక్షణాలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పుట్టిన ప్రతి బిడ్డకి 9 నెలల్లో ఒకటవ డోస్, 16నుండి 24 నెలల వయసులోపు మీజిల్స్- రూబెల్ల రెండవ డోస్ పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ పంపిణీ చేయాల్సి ఉంది.
కానీ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వ్యాక్సినేషన్ పొందని చిన్నారుల్లో ప్రస్తుతం మీజిల్స్ రూబెల్లా వ్యాధి సంక్రమిస్తోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రెండు పర్యాయాలు వ్యాక్సిన్ పొందాల్సి ఉండగా ఒక పర్యాయం అలసత్వం చేసినప్పటికీ వ్యాధి సోకే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి లాలాజలం తుమ్ములు స్పర్శ ఆధారంగా కూడా వ్యాప్తి జరిగే ఆస్కారం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావం గర్భవతుల్లో అయితే అత్యంత ప్రాణాపాయం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గర్భిణీ గర్భం దాల్చే కంటే ముందే వ్యాక్సినేషన్ వేసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
అయినా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది సరైన అవగాహన కల్పించకపోవడం చిన్నారుల్లో వ్యాక్సిన్ పంపిణీ చేయడంలోనూ నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ వ్యాధి ప్రభావం చూపుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సిహెచ్ సి, పీపీ యూనిట్ కేంద్రాల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే చిన్నారుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని చర్చ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో జ్వరం, చర్మంపై ఎర్రటి మచ్చలు, దగ్గు, కళ్లు ఎర్రబారడం వంటి లక్షణాలతో పలువురు పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు.
కొంతమంది చిన్నారుల్లో ఈ వ్యాధిని గుర్తించి అమ్మ తల్లి అంటూ తల్లిదండ్రులు వారి సంరక్షణలోనే ఉంచుకుంటూ ఆసుపత్రిని కూడా ఆశ్రయించడం లేదని తెలుస్తోంది. మరి కొంతమంది జ్వరం, దగ్గు చర్మంపై ఏర్పడుతున్న మచ్చలను గుర్తిస్తూ జిల్లా జనరల్ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. ఈ సంఖ్య సుమారు 50 కి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిస్థితి ఉన్నప్పటికీ సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం, వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు పెద్దగా స్పందన కనిపించడం లేదని స్థానికులు వాపోతున్నారు. పిల్లల్లో ఈ వ్యాధి వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో తక్షణ చర్యలు తీసుకుని టీకాలు అందుబాటులో ఉంచాలని, గ్రామాల వారీగా వైద్య బృందాలు ఏర్పాటు చేసి పరిస్థితిని నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
వైద్యాధికారంలో తీవ్ర నిర్లక్ష్యం.!
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్స్, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి గ్రామంలోని చిన్నారులకు, అప్పుడే పుట్టిన బిడ్డలకు ఆయా టీకాలు, మీజిల్స్ రూబెల్లా వ్యాధి సంక్రమించకుండా ముందస్తు వ్యాక్సినేషన్ పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఆశ, ఏఎన్‌ఎం, పబ్లిక్ హెల్త్ నర్స్, సూపర్వైజర్లు, మండల వైద్యాధికారులు పర్యవేక్షకులు ఇలాజిల్లా స్థాయి అధికారుల వరకు వ్యాక్సినేషన్ పట్ల శ్రద్ధ చూపకపోవడంతో చాలామంది చిన్నారులు వ్యాక్సినేషన్ పొందడం లేదని ఫలితంగానే వ్యాధి ప్రభావం చూపుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొంతమంది గ్రామీణ స్థాయి అధికారుల నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు పైరవీలు రాజకీయ ప్రజాప్రతినిధుల బలం అండ దండలతో కనీసం విధులకు కూడా సక్రమంగా హాజరు కావడం లేదని విమర్శలు ఉన్నాయి. మరి కొంతమంది ఏజెన్సీ ప్రాంతాల నుండి డిప్యూటేషన్ పై జిల్లా కేంద్రం, పరిసర గ్రామాల వైపు ఆరోగ్య కారణాలు సాకు చూపి డిప్యుటీషన్ డ్యూటీలు వేయించుకొని వారి వారి ఇళ్లల్లకే పరిమితమయ్యారని అయినా సంబంధిత పర్యవేక్షణ చేయాల్సిన అధికారుల సైతం అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.
జిల్లా కేంద్రంలోని పిపి యూనిట్, పెద్ద ముద్దునూరు పీహెచ్ సి కేంద్రంలోనూ పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరపడం లేదని రోజుల తరబడి జిల్లా జనరల్ ఆసుపత్రికి పిల్లలను వెంటబెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. జిల్లా ఉన్నత స్థాయి అధికారులు సైతం వైద్య ఆరోగ్య శాఖ పట్ల శ్రద్ధ చూపకపోవడంతోనే నిర్లక్ష్యం రాజమౌళితోందని ఫలితంగా ప్రమాదకరమైన వ్యాధులు ప్రబలుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిర్లక్ష్యం వహించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం
విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారి పట్ల కఠినంగా వ్యవహరించేందుకు ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చా రు. ఆకస్మిక తనిఖీలు కూడా జరుపుతున్నాం. వ్యాక్సినేషన్ పట్ల అశ్రద్ధ చూపే వారిపై విచారించి కఠినంగా వ్యవహరిస్తాం.
రవికుమార్, ఇన్చార్జి వైద్యాధికారి నాగర్‌కర్నూల్ జిల్లా




