19-01-2026 09:25:44 PM
అటవీ శాఖతో కలిసి కార్యాచరణ
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలో గుర్తించిన చెరువులు, రిజర్వాయర్ల వెట్‌ల్యాండ్స్ సంరక్షణ, అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ, నీటి పారుదల, సంబంధిత అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ. చెరువులు, రిజర్వాయర్ల వెట్‌ల్యాండ్స్ సహజంగా నీరు నిల్వ ఉండే తడిసిన భూములు ప్రకృతి సమతుల్యతకు కీలకమని, ఇవి భూగర్భ జలాల పెరుగుదలకు, పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడతాయని తెలిపారు.
పలు వెట్‌ల్యాండ్స్‌ను గుర్తించి మ్యాపింగ్ చేసి, వాటి అభివృద్ధి కోసం అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ఎంపిక అయిన జలవనరులను అభివృద్ధి, మరమ్మత్తు పనులను చేస్తారని పేర్కొన్నారు. దీంతో పక్షులు, జంతువులకు ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే పర్యాటక రంగం అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డీఆర్డీఓ గీత, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి కిశోర్ కుమార్, ఈఈలు సంతు ప్రకాశ్, ప్రశాంత్, డీఈలు, ఏఈలు, ఎఫ్ఆర్ఓ కల్పన తదితరులు పాల్గొన్నారు.