19-01-2026 09:22:53 PM
జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్
గద్వాల: గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గద్వాల పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు సూచనలను ఇచ్చారు.
ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా సమగ్ర వివరాలతో జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించేందుకు గాను శాఖల వారీగా పరిమితితో కూడిన ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. సమర్ధవంతంగా విధులు నిర్వహించిన సిబ్బందికి ప్రాధాన్యతనిస్తూ పేర్లను ప్రతిపాదనల రూపంలో సిఫార్సు చేయాలని అధికారులకు సూచించారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశభక్తిని చాటేలా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారికి సూచించారు. ప్రథమ చికిత్స కిట్ అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రోటోకాల్ ను పాటిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, అడిషనల్ ఎస్పీ శంకర్ నాయక్, ఆర్డీవో అలివేలు, కలెక్టరేట్ ఏ ఓ భూపాల్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు