పార్క్ ఆధునీకరణకు వేగంగా చర్యలు
ముకరంపుర,(విజయక్రాంతి): నగరంలోని జిల్లా పరిషత్ క్వార్టర్స్ లో ఉన్న నగరపాలక సంస్థ పార్కును త్వరలోనే సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. పార్కు ఆధునీకరణ పనుల్లో భాగంగా ఆయన పార్కును సందర్శించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ అధికారులతో మాట్లాడుతూ, పార్కులో నిరుపయోగంగా ఉన్న పలు సౌకర్యాలను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు.
ఆహ్లాదకరమైన వాతావరణం కోసం గ్రీనరీ పెంపొందించాలి. పార్కులో తగినంత లైటింగ్ తో పాటు ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సరిగ్గా పది సంవత్సరాల క్రితం అప్పట్లో రూ.52 లక్షల వ్యయంతో ఈ పార్కును నిర్మించి ప్రారంభించినట్లు ఆయన గుర్తుచేశారు. తిరిగి ఇప్పుడు ఈ పార్కును ఆధునీకరించి,అధునాతన సౌకర్యాలు నగర ప్రజలకు పూర్తిస్థాయిలో ఆహ్లాదాన్ని, సౌకర్యాలను అందించేందుకు కృషి చేస్తున్నామని యాదగిరి సునీల్ రావు తెలియజేశారు.






