నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
తాగునీటి, విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
నారాయణఖేడ్, ఏప్రిల్ 9: వేసవి కాలం ప్రారంభమైనందున నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో పట్టణాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలని ఎమ్మెల్యే డాక్టర్ పి.సంజీవరెడ్డి అన్నారు. గురువారం ఆయా శాఖల అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే చిన్న చిన్న ఫిర్యాదులను సైతం అధికారులు స్పందించి వెంటనే వాటిని పరిష్కరించాలని ఆయన సూచించారు. మిషన్ భగీరథ లీకేజీలు, విద్యుత్ తీగల సమస్యలు ఉంటే తక్షణమే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. గ్రామాల్లో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే తగువిధంగా పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. సమీక్ష కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.




