భూసమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
కలెక్టర్ స్నేహ శబరీష్
మహబూబాబాద్, మే 26 (విజయక్రాంతి): మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో ఫారెస్ట్, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వపరంగా పరిష్కార మార్గం చూపి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ తో కలిసి నియోజకవర్గ పరిధిలో రైతులకు ఎదురవుతున్న ఫారెస్ట్, అసైన్డ్, రెవెన్యూ భూముల సమస్యల పరిష్కారానికి అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల ఆధ్వర్యంలో జాయింట్ సర్వే నిర్వహించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవచూపి, వారికి తగిన హక్కు పత్రాలను అందిస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారని చెప్పారు. నియోజకవర్గ పరిధిలో వివిధ మండలాల్లో నెలకొన్న భూ సమస్యలను ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.






