రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు అందేలా చర్యలు
జిల్లా కలెక్టర్ కె .హరిత
ఎరువులు, విత్తనాల దుకాణం ఆకస్మిక తనిఖీ
స్టాక్ వివరాల నిర్వహణలో నిర్లక్ష్యంపై యజమానికి హెచ్చరిక
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు .గురువారం ఆసిఫాబాద్ మండలం బురుగూడా గ్రామంలోని కళావతి ట్రేడర్స్ ఫర్టిలైజర్ షాప్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పత్తి విత్తనాల ప్యాకెట్లను పరిశీలించి ,స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. దుకాణంలో ఉన్న విత్తనాలు, ఎరువుల స్టాక్ వివరాలు రిజిస్టర్ లో నమోదు చేయకపోవడంపై యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్ లో నమోదు చేయాలని, అలాగే దుకాణంలో ఏర్పాటు చేసిన బోర్డుపై అందుబాటులో ఉన్న విత్తనాలు, ఎరువుల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులను మోసం చేసే విధంగా నకిలీ పత్తి విత్తనాల విక్రయాలను ప్రభుత్వం ఏమాత్రం సహించదని స్పష్టం చేశారు. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాగే ప్రభుత్వం నిషేధించిన గడ్డి మందులు లేదా ఇతర వ్యవసాయ రసాయనాల విక్రయం జరిగితే సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎరువులు, విత్తనాల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.






