సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు
డిప్యూటీ కమిషనర్ శైలజ
మేడిపల్లి,జూన్ 24 (విజయక్రాంతి): సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నామని బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఏ శైలజ అన్నారు. బుధవారం బోడుప్పల్ సర్కిల్ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం 4 డివిజన్ల పరిధిలోని 17 పంపిణీ కేంద్రాల్లో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద మొత్తం 23,694 మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
వీరిలో స్వయం సహాయక సంఘాల (ఎస్ హెచ్ జి) మహిళలు 21,889 మంది, ఎస్ హెచ్ జి కాని మహిళలు 1,805 మంది ఉన్నారు. ప్రారంభమైన పంపిణీ కార్యక్రమం అన్ని కేంద్రాల్లో సజావుగా కొన సాగుతున్నాయి. అర్హులైన లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమీషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారని పేర్కొన్నారు.






