01-01-2026 12:53:33 AM
అత్యాధునిక చికిత్స చేసిన వైద్యులు
హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): ఆహారం మింగలేక, నీళ్లు కూడా తాగలేని స్థితికి చేరుకుని రెండేళ్లకు పైగా తీవ్ర నరకయాతన అనుభవించిన రోగికి మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు కొత్త జీవితాన్ని అందించారు. అరుదైన అన్నవాహిక సమస్యతో అకాలేషియా కార్డియా వ్యాధితో 25 కిలోల బరువు తగ్గిన 46 ఏళ్ల ఒస్మాన్ బాబికర్ ఎల్హాజ్‌కు విజయవంతంగా ఎటువంటి కోతలు, కుట్లు లేని అత్యాధునిక ఎండోస్కోపిక్ చికిత్స ద్వారా పూర్తిస్థాయి ఉపశమనం కలిగించారు. గత రెండున్నర సంవత్సరాలుగా ఒస్మాన్ బాబికర్ తీవ్రమైన మింగుడు సమస్యతో బాధపడుతున్నారు.
తిన్న ఆహా రం కడుపులోకి వెళ్లకుండా గొంతులోనే ఆగిపోవడం, ముక్కు ద్వారా ఆహారం బయటకు రావడం, తీవ్రమైన ఛాతి నొప్పి వంటి సమస్యలతో ఆయన జీవితం అస్తవ్యస్తమైంది. మెడికవర్ హాస్పిటల్స్లోని డా. మోకా ప్రణీత్, సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్, రోగికి తగిన పరీక్షలు నిర్వహించి ఆయనకు ‘అకాలేషియా కార్డియా’ అనే అరుదైన అన్నవాహిక వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. ఈ వ్యాధిలో అన్నవాహిక చివర ఉండే కండరం సడలకపోవడంతో ఆహారం కడుపులోకి వెళ్లదు.
ఒస్మాన్ కేసులో అన్నవాహిక సాధారణం కంటే విపరీతంగా ఉబ్బి 7.1 సెం.మీ వరకు విస్తరించి, ఆహారం నిల్వ ఉండటం గుర్తించారు. డా మోకా ప్రణీత్, పెరోరల్ ఎండోస్కోపిక్ మియోటోమీ అనే అత్యాధునిక, మచ్చలు లేని ఎండోస్కోపిక్ చికిత్సను నిర్వహించారు. నోటి ద్వారా ఎండోస్కోప్ను పంపి, అన్నవాహిక లోపలి పొరలో గట్టిపడిన కండరాన్ని కట్ చేయడం ద్వారా ఆహారం వెళ్లే మార్గాన్ని సుగమం చేశారు. అనంతరం రోగి సాధారణంగా ఆహారం మింగగలుగుతున్నారు.