17 August, 2026 | 8:58 PM

SIR ఫేజ్-2పై ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం..

17-08-2026 07:50 PM

ఆలేరు, ఆగస్టు 17 (విజయక్రాంతి): భువనగిరి పట్టణంలోని న్యూ వివేర కన్వెన్షన్ హాల్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఫేజ్-2 సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నటరాజన్ మీనాక్షి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు SIR ఫేజ్-2 ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ శ్రేణుల సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా SIR ఫేజ్-2లో అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటర్ జాబితాలో ఉండేలా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.

అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి నష్టపోకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన, సమన్వయం చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఉత్తమ్ పద్మావతి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామేల్, బాలు నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.