21 June, 2026 | 4:47 PM

రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం

21-06-2026 03:24 PM

హైదరాబాద్: రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం పర్యటించారు. బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశానికి విచ్చేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR)కు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాఫియా రాజ్యం నడుస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దండుపాళ్యం ముఠాకు అధ్యక్షుడు అని పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో దోచుకో.. దాచుకో.. అన్నట్లుగా కాంగ్రెస్ మంత్రులంతా కలిసి మాఫియాలు, స్కామ్‌లు చేస్తున్నారు. నిజాయితీగా పనిచేసే అధికారులకు గౌరవం లేదని ఆరోపించారు.

 నాడు కేసీఆర్ హయాంలో అంతర్జాతీయ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్‌గా, సూపర్ స్టార్ రజనీకాంత్ గారే చూసి అబ్బురపడేలా ఉన్న హైదరాబాద్.. నేడు కాంగ్రెస్ 420 పాలనలో కుదేలైందని విమర్శించారు. మూసీ, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలుస్తూ నగరంలో శాంతిభద్రతలను గాల్లోకి దీపాల్లా మారుస్తూ వీరు చేస్తున్న దుర్మార్గాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు. 

రూ.వేల కోట్లతో గాంధీ విగ్రహం పెట్టడం కోసం పేదల ఇళ్లను కూల్చడానికి కంకణం కట్టుకున్నాడని, స్వయంగా గాంధీజీ మనవడే వద్దన్నా, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, రేవంత్ అసలే పట్టించుకోకుండా బీజేపీతో కుమ్మకై ఈ వినాశనానికి తెరలేపిండని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రాజెక్టుకు సహకరిస్తూ ఇచ్చిన రక్షణ శాఖ భూములను కాపాడాలని కేటీఆర్ కోరింది.