7 July, 2026 | 8:49 PM

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

07-07-2026 07:34 PM

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ అర్బన్: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని మెట్టుగడ్డ ప్రాంతంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యాలయంలో నిర్వహించిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమావేశానికి హాజరై ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను ఆవిష్కరించారు.  అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులుగా సేవలందించిన కాలంలో ప్రజల ప్రయాణ సౌకర్యాల కోసం మీరు చేసిన కృషి అపారమని కొనియాడారు.

ప్రతికూల పరిస్థితుల్లో కూడా విధి నిర్వహణలో మీరు చూపిన నిబద్ధత, కర్తవ్యనిష్ఠ ఎంతో ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలో మీరు గడిపిన అనుభవం, ప్రస్తుతం సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని, ముఖ్యంగా మహబూబ్ నగర్ అభివృద్ధి దిశగా మీ సూచనలు, ఆలోచనలు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి నెలలో ఒక రోజు ఫోరం కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని, అందుకే వారికి సమీపంలోనే వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం అవసరమని పేర్కొన్నారు. 

విశ్రాంత ఉద్యోగులకు ప్రస్తుతం అందుతున్న పెన్షన్ చాలా తక్కువగా ఉందని, వారి జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని పెన్షన్ పెంపు అవసరం ఉందని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కార్పొరేటర్ ప్రశాంత్, సల్మాన్ , నాయకులు అబ్దుల్ హక్, సతీష్, బాను, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల అధ్యక్షులు రాజాసింహుడు, కార్యదర్శి కె.రవీందర్ రెడ్డి, సీనియర్ సిటిజన్స్ ఫోరం నాయకులు జగపతి రావు, నాగభూషణం, అంజన్న, నాంజనేయులు, పి.హేమంత్ కుమార్, ఆర్ నారాయణ, అబ్దుల్ కరీం, వహీద్, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.