14 May, 2026 | 4:03 AM

వాడేది డొమెస్టిక్ సిలిండర్లు... బూచి చూపించేది కమర్షియల్ సిలిండర్...?

14-05-2026 02:39 AM

ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్న వ్యాపారులు....? 

సామాన్యుడి నడ్డి విరుస్తున్న గ్యాస్ దందా ...? 

తనిఖీల సమాచారం ముందుగానే చేరవేస్తున్న గ్యాస్ డెలివరీ బాయ్స్?

వనపర్తి, మే 13 (విజయక్రాంతి): జిల్లాలో గృహ వినియోగానికి మాత్రమే ఉద్దేశించిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వ్యాపార అవసరాలకు అక్రమంగా వినియోగిస్తూ కొందరు వ్యాపారులు యదేచ్చగా గ్యాస్ దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాల్లో డొమెస్టిక్ సిలిండర్ల వినియోగం బహిరంగంగానే సాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా బ హిరంగానే వినిపిస్తున్నాయి.

కమర్షియల్ సిలిండర్ ధర పెంపును బూచిగా.... 

ఒకవైపు తక్కువ ధరకు లభించే డొమెస్టిక్ సిలిండర్లను వాడుతూ, మరోవైపు కమర్షియల్ గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి అంటూ ఆహార పదార్థాల ధరలను అమాంతం పెంచి సామాన్య ప్రజలపై అదనపు భారం మోపుతున్నారు.

టీ నుంచి టిఫిన్ వరకు, భోజనం నుంచి బేకరీ పదార్థాల వరకు ప్రతి వస్తువుపై ధరలు పెంచి వినియోగదారులను నిలువునా దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అనేక వ్యాపార సంస్థల్లో కమర్షియల్ సిలిండర్లు కనిపించాల్సిన చోట గృహ వినియోగ సిలిండర్లే దర్శనమిస్తున్నాయి. అయితే ధరల పెంపు విషయంలో మాత్రం కమర్షియల్ సిలిండర్ల పేరును బూచిగా చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని వినియోగదారు లు మండిపడుతున్నారు.

 తనిఖీల సమాచారం ముందుగానే చేరవేస్తున్న గ్యాస్ డెలివరీ బాయ్స్? 

వ్యాపారాలు నిర్వహించే చోట సివిల్ సప్లై శాఖ అధికారులు నిర్వహించే తనిఖీలు కూడా కేవలం నామమాత్రంగానే మారిపోయాయన్న విమర్శలు ఉన్నాయి. తనిఖీలకు ముందే కొంతమంది గ్యాస్ డెలివరీ బాయ్స్ వ్యాపారులకు సమాచారం చేరవేస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. అధికారులు వస్తున్నారన్న సమాచారం అందగానే డొమెస్టిక్ సిలిండర్లను దాచిపెట్టి, కమర్షియల్ సిలిండర్లను ముం దుకు పెట్టి తప్పించుకుంటున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

ఈ వ్యవహారంలో గ్యాస్ ఏజెన్సీల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఇంటికి పరిమితంగా సరఫరా కావాల్సిన డొమెస్టిక్ సిలిం డర్లు భారీ సంఖ్యలో వ్యాపార సంస్థలకు ఎలా చేరుతున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు కఠిన చర్యలు తీసుకో కపోవడంతో అక్రమాలు మరింత పెరిగిపోతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు జరిగేనా....? 

ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న గ్యాస్ను వాణిజ్య అవసరాలకు వినియోగించడం వల్ల నిజమైన లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా యం త్రాంగం ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమాలకు పాల్పడు తున్న వ్యాపారులు, సహకరిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.