14 May, 2026 | 4:03 AM

సింగోటం లింక్ కెనాల్ పనులు వేగవంతం చేయాలి

14-05-2026 02:41 AM

బొల్లారంలో భూబాధిత రైతులతో మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖాముఖి

భూ సేకరణకు రైతులు సహాకరించాలి

కెనాల్ లో భూములు కొల్పోతున్న రైతులకు మూడింతల పరిహారం

పట్టా ఉన్న అసైన్డ్ భూములతో పాటు పట్టా లేని రైతులకు కూడా పరిహారం

సత్వరమే పరిహారం చెల్లించి పనులు మొదలయ్యేలా చూడాలి

అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం

వనపర్తి , మే 13 (విజయక్రాంతి): సింగోటం-గోపాలదిన్నె లింక్ కెనాల్ పనులను త్వరితగతిన పూర్తి చేసి, చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులకు ప్రస్తుత మార్కెట్ ధర కంటే మూడింతల పరిహారం అందేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామంలోని రైతు వేదిక వద్ద సంగినేనిపల్లి, తూముకుంట, బొల్లారం గ్రామాలకు చెందిన భూబాధిత రైతులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమై, వారి అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు.

ఎకరాకు రూ.11.50 లక్షల పరిహారం

ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మార్కెట్ విలువ రూ.1,87,500 తక్కువగా ఉందంటూ రైతులు వ్యక్తం చేసిన అభ్యంతరాలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. బేసిక్ మార్కెట్ విలువను తక్షణమే రెండింతలు పెంచి రూ.3,75,000గా ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పెంచిన విలువ (రూ.3,75,000) ఆధారంగా భూసేకరణ చట్టం ప్రకారం మూడింతల పరిహారంతో పాటు, గెజిట్ ప్రచురించిన నాటి నుంచి వడ్డీని కూడా కలిపి ఎకరాకు మొత్తం రూ.11,50,000 చొప్పున చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి తీసుకున్న ఈ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. తక్షణమే అవార్డు కాపీలు మంజూరు చేసి పరిహార పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆర్డీవో సుబ్రహ్మణ్యాన్ని మంత్రి ఆదేశించారు.

అసైన్డ్, పట్టా లేని రైతులకూ సమన్యాయం

సాధారణ పట్టాదారులతో పాటే అసైన్డ్ పట్టాలు కలిగిన రైతులకు కూడా ఇదే తరహా పరిహారాన్ని వర్తింపజేయాలని బొల్లారం గ్రామస్థులు మంత్రి దృష్టికి తీసుకురాగా, దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ.. అసైన్డ్ పట్టాదారులకు సమాన పరిహారం అందించడంతో పాటు, ఎలాంటి పట్టాలు లేకుండా చాలా కాలంగా ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న పేద రైతులకు కూడా భూసేకరణ చట్టంలోని  ట్రిపుల్ ఆర్ (’3ఆర్) ప్రకారం పూర్తి పరిహారం చెల్లించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

40 వేల ఎకరాలకు సాగునీరు

కొల్లాపూర్ నియోజకవర్గంలోని వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో జూరాల ప్రాజెక్టు పరిధిలో 25 వేల ఎకరాలు, భీమా ప్రాజెక్టు కింద 15 వేల ఎకరాలు.. మొత్తం 40 వేల ఎకరాల చివరి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదని మంత్రి జూపల్లి వివరించారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికే 2018లో సింగోటం-గోపాలదిన్నె లింక్ కెనాల్కు పరిపాలనా అనుమతులు మంజూరు చేయించి నట్లు గుర్తుచేశారు. ఈ కెనాల్ నిర్మాణం కోసం మొత్తం 305.23 ఎకరాల భూమిని  సేకరించాల్సి ఉందన్నారు.

భూసేకరణ వివరాలు:

నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లి: 50 ఎకరాలు

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం: 73 ఎకరాల 13 గుంటలు

వల్లభాపూర్: 87 ఎకరాల 3 గుంటలు

సంగినేనిపల్లి: 94 ఎకరాల 8 గుంటలు

ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా భూసేకరణ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, బొల్లారం, తూముకుంట సర్పంచులు సుదర్శన్ రెడ్డి, రామన్ గౌడ్, సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, చిన్నారెడ్డి, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.