10-12-2025 02:37:48 AM
13న ఉప్పల్ స్టేడియంలో సందడి
ఘన స్వాగతం పలకనున్న రాష్ట్ర ప్రభుత్వం
ఆడనున్న సీఎం రేవంత్ రెడ్డి, ఫుట్‌బాల్ దిగ్గజం
టికెట్ ధర రూ.30 వేలైనా హాట్ కేకుల్లా విక్రయాలు
ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 9 (విజయక్రాంతి): విశ్వనగరం హైదరాబాద్‌ను మెస్సీ మానియా చుట్టుముట్టింది. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ రాక కోసం భాగ్యనగరం ముస్తాబవుతోంది. దాదాపు 11 ఏళ్ల విరామం తర్వాత మెస్సీ భారత్‌లో పర్యటిస్తుండటంతో క్రీడాభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
గోట్ ఇండియా టూర్-2025, లో భాగంగా జూలై 13వ తేదీన మెస్సీ హైదరాబాద్‌లో సందడి చేయనున్నారు. ఈ నెల13న ఉదయం కోల్‌కతాలో పర్యటించే మెస్సీ.. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకొని రాత్రి 7:30 గంటలకు ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో అడుగుపెడతారు. అక్కడ అభిమా నులను అలరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మ్యా ఫార్మాట్: అభిమానులకు తమ ఫేవరెట్ ప్లేయర్‌ను దగ్గరగా చూసే అవకాశం కల్పించేందుకు 7 7 సెవెన్ ఏ సైడ్ ఫార్మాట్‌లో ఎగ్జిబిషన్ మ్యా నిర్వహించనున్నారు. ఇందులో మెస్సీతో పాటు ఇతర క్రీడా, సినీ ప్రముఖులు పాల్గొంటారు. మ్యాచ్‌తో పాటు లైవ్ మ్యూజిక్ కన్సర్ట్, వీఐ పీ పాస్ హోల్డర్లకు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఉంటుంది. కాగా స్వతహాగా ఫుట్ బాల్ క్రీడాకారుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మెస్సీతో కలిసి గ్రౌండ్‌లో సందడి చేసే అవకాశం ఉంది. ఇందుకోసం ఆయన తీరిక వేళల్లో ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఇప్పటికే మంత్రు లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ర్ట ప్రభుత్వం మెస్సీకి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. మెస్సీ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో టికెట్ల డిమాండ్ చూస్తే అర్థమవుతోంది. టికెట్ ధర గరిష్టంగా రూ. 30 వేల వరకు ఉన్నప్పటికీ.. ఫ్యాన్స్ ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. కోల్‌కతా, హైదరాబాద్ తర్వాత 14న ముంబై, 15న ఢిల్లీలో మెస్సీ పర్యటన కొనసాగనుంది.