27 June, 2026 | 3:33 AM

గంజాయి జోలికి వెళితే జైలే గతి..

27-06-2026 02:01 AM

గోవిందరావుపేట, జూన్ 26 (విజయక్రాంతి): గంజాయి జోలికి వెళితే జైలు పాలు కాక తప్పదని, ఉజ్వల భవిష్యత్తులో నాశనం చేసుకోవద్దని పసర ఎస్ఐ తాజుద్దిన్ యువతకు పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాలతో, డి.ఎస్పి రవీందర్ సూచనలతో, పసర సీ.ఐ. పత్తిపాక దయాకర్ పర్యవేక్షణలో ఎస్ఐ తాజుద్దీన్ అంతర్జాతీయ మాదకద్రవ్యాల దినోత్సవం సందర్భంగా రామాలయం సర్కిల్ పరిధిలో నుంచి పసర చౌరస్తా 163 జాతీయ రహదారిపై 200 యువతతో భారీ ర్యాలీ నిర్వహించారు.

యువత చెడుదారులకు వెళ్లకుండా, అవగాహన కల్పిస్తూ, యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ యువతతో కలిసి పోస్టర్ ఆవిష్కరణను ఆవిష్కరించారు. యువతే దేశ భవిష్యత్తు, మత్తు కు బానిసై బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఎస్ఐ తాజుద్దీన్ పేర్కొన్నారు. మండలంలోని ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, ట్రాలీలకు రేడియం స్టిక్కర్లు లేకపోతే సీజ్ చేస్తామన్నారు. 163 జాతీయ రహదారిపై ఆవులు, గేదెలు కనిపిస్తే నేరుగా గోశాలకు తరలిస్తామని, రోడ్డుపై పశువుల కారణంగా ప్రమాదం జరిగి ప్రాణం పోతే యజమానులపై క్రిమినల్ కేసులు తప్పవన్నారు.