- డీపీఆర్ సిద్ధం చేస్తున్న అధికారులు
- ఫేజ్ 2లోనే పనులు చేపట్టేలా ప్రణాళికలు
- మరింత పెరగనున్న అంచనా వ్యయం
- పనులు పూర్తయితే పెట్టుబడులు పెరిగే అవకాశం
- యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా బేగరికంచెలో ఫ్యూచర్, ఫోర్త్ సిటీ నిర్మాణం వైపు అడుగులు వేస్తోంది. దీనిలో భా గంగా అక్కడికి మెట్రో రైల్ మార్గాన్ని విస్తరించేందుకు మెట్రో అధికారులు ప్రణాళిక లు రూపొందిస్తున్నారు. ఫేజ్ 2లో భాగం గా చేపట్టనున్న పనులతోనే బేగరికంచెకు మెట్రో రైళ్లు నడిపేందుకు డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల బేగరికంచెలో స్కిల్ యూని వర్సిటీకి శంకు స్థాపన చేసిన సందర్భంగా ప్రకటించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు బేగరికంచె
రాజేంద్రనగర్‌లో నిర్మిస్తున్న హైకోర్టు నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మీదుగా బేగరికంచె (ముచ్చర్ల) వరకు మెట్రో రైల్‌ను విస్తరింపజేసేందుకు రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో మెట్రో అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డికి నివేదికలు సమర్పించనున్నారు. మరోవైపు ఫేజ్ 2 పనులు, బేగరికంచెకు మెట్రో విస్తరణకు అధికారులు ఇప్పటికే సర్వేలు చేపడుతుండడం గమనార్హం.
పెట్టుబడులకు మార్గం సుగమం
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్ రెవెన్యూ పరిధిలోని బేగరికంచెను ఫ్యూచర్‌సిటీగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బేగరికంచెకు దగ్గరలోని మహేశ్వరం పరిసరాల్లో ఇప్పటికే స్వదేశీ, విదేశీ కంపెనీలు ఉన్నాయి. దీనికి తోడు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రమం, హైదరాబాద్ శ్రీశైలం నేషనల్ హైవే కూడా సమీపంలోనే ఉన్నాయి. వీటన్నింటినీ బేరీజు వేసుకుని బేగరికంచెను కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సర్కార్ ముందుకు సాగుతోంది. మెట్రో సర్వీసులను ఇక్కడివరకు విస్తరిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలు మరిన్ని పెరుగుతాయని సర్కార్ భావన.
నాలుగేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో..
మెట్రో ఫేజ్ పనులను నాలుగేళ్లలో ఐదు కారిడార్ల పరిధిలో రూ. 24,042 కోట్లతో 78.4 కి.మీ మేర విస్తరింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ముందు గా పాతబస్తీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో పనులు చేపట్టాలనే నిశ్చ యానికి వచ్చింది. దీనిలో భాగంగానే ఇటీవల ప్రకటించిన చేసిన బడ్జెట్‌లో మెట్రోకు రూ.1,100 కోట్లు కేటాయించింది. ఈ పనులతో పాటే శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బేగరికంచెకు మెట్రో సర్వీసులకు శ్రీకారం చుట్టేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. శంషాబాద్, తుక్కుగూడ, ఫాబ్‌సిటీ, రావిర్యాల, కొంగర, విలిమినేడు, తిమ్మాపూర్, తంజాగూడ, మీర్ఖాన్‌పేట్ మీదుగా మెట్రోను విస్తరించే యోచన లో ఉన్నట్లు సమాచారం. బేగరికంచె వరకు మెట్రో విస్తరణకు అదనంగా మరో రూ.10 వేల కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.