బాధితుల వద్దకే ఆన్సైట్ ఎఫ్ఐఆర్ ద్వారా కేసుల నమోదు
సంఘటనా స్థలంలోనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్)
జిల్లాలో ఇప్పటివరకు 12 కేసులు నమోదు: ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ప్రజలకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన పోలీస్ సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ శాఖ కీలక ముందడుగు వేసిందని జిల్లా ఎస్పీ తెలిపారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు కొన్ని ప్రత్యేక నేరాల్లో బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, వారి వద్దకే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసే ఆన్సైట్ ఎఫ్ఐఆర్ విధానాన్ని జిల్లా వ్యాప్తoగా అమలు చేస్తున్నామన్నారు.
నేరం జరిగిన తరువాత శారీరకంగా,మానసికంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం ఒక భారంగా మారకూడదనే ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఎస్పీ పేర్కొన్నారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ విధానం అమలులో ఉందని తెలిపారు.ఇప్పటికే ఈ విధానం ద్వారా జిల్లాలో 12 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల వద్ద నుంచే ఫిర్యాదును స్వీకరిస్తారు.
ఫిర్యాదుదారులు డయల్ 100కు కాల్ చేసినా, నేరుగా సమాచారం ఇచ్చినా వెంటనే స్పందించి ట్యాబ్‌ల ద్వారా ఆన్లైన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు.రోడ్డు ప్రమాదాలు,గొడవలు వంటి ఘటనల్లో గాయపడిన వారికి తక్షణ వైద్యసాయం అందిస్తూ ఆసుపత్రికి తరలిస్తారు. ఈ ఆన్సైట్ ఎఫ్ఐఆర్ విధానం ద్వారా రోడ్డు ప్రమాదాలు, గొడవలు, దొంగతనాలు, భార్యాభర్తల వివాదాలు, వేధింపులు, అనుమానాస్పద మృతులు వంటి కేసులను సంఘటనా స్థలంలోనే తక్షణం నమోదు చేసే అవకాశం కలుగుతుంది.ఈ విధానం ద్వారా బాధితులకు త్వరిత న్యాయం అందించడమే కాకుండా, పోలీస్ సేవలపై ప్రజల నమ్మకం మరింత పెరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.




