07-10-2024 01:24:24 AM
నగరానికి ఉత్తర దిక్కును కాదని ఊహల నగరానికి మెట్రోనా?
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6(విజయక్రాంతి): మేడ్చల్‌కు మెట్రోను విస్తరిం పజేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకా నంద్ అన్నారు. ఆదివారం జీడిమెట్లలోని గాంధీ విగ్రహం వద్ద మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భం గా మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో నగరానికి నలువైపులా మెట్రో విస్తరణ, ఫ్లుఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులతో మాజీ సీఎం కేసీఆర్ నగరాన్ని అభివృద్ధి చేశారన్నారు. తమ ప్రభుత్వంలో నగరానికి ఉత్తర దిక్కున గల కొంపల్లి, మేడ్చల్‌తో పాటు తూముకుంట, శామీర్‌పేట్ ప్రాంతాలకు మెట్రో విస్తరణపై సర్వే సంస్థలను ఎంపిక చేసి పనులను అప్పగించినట్లు చెప్పారు.
కానీ, కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడిన కొన్ని రోజులకే గత ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికను పక్కనపెట్టిందని ఆరోపించారు. ఫోర్త్ సిటీ పేరిట ఊహ ల నగరాన్ని సృష్టించి, లేని నగరానికి మెట్రో విస్తరణ పేరిట రూ.8 వేల కోట్లను ప్రతిపాదించడంతో సీఎం రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారని ఆరోపించారు. మేడ్చల్‌కు మెట్రో విస్తరణ చేపట్టకపోతే మంత్రులను తిరగనివ్వమని హెచ్చరించారు.