15 March, 2026 | 3:24 AM

హైడ్రాకు బ్రహ్మాస్త్రం.. అక్రమార్కులకు ఇక చుక్కలే

15-03-2026 02:08 AM

క్యూర్ చట్టంలో అపరిమిత పవర్స్.. నేరుగా నోటీసులు, వెనువెంటనే కూల్చివేతలు..

ఇతర శాఖలపై ఆధారపడకుండానే యాక్షన్.. హైడ్రాను మరింత పటిష్ఠం చేయనున్న సర్కార్

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 14 (విజయక్రాంతి): నగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పడిన హైడ్రా ఇకపై మరింత శక్తివంతం కాబోతోంది. ఇప్పటి వరకు కేవలం ఇతర శాఖల సమన్వయంతో, పరిమిత అధికారాలతో పని చేస్తున్న హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం అపరిమిత చట్టబద్ధ అధికారాలు కల్పించాలని నిర్ణయించిం ది. ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన క్యూర్ చట్టంలో భాగంగా హైడ్రాకు పూర్తిస్థాయి స్వయంప్రతిపత్తి కల్పిస్తూ కీలక మార్పులు చేయబోతోంది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదాను వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి, చట్టసభ ఆమోదం పొం దేలా ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది.

నోటీసులు, కూల్చివేతలు.. అన్నీ హైడ్రా ఇష్టమే..

ప్రస్తుత విధానం ప్రకారం హైడ్రా ఏదైనా ఆక్రమణను కూల్చివేయాలంటే రెవెన్యూ లేదా మున్సిపల్ అధికారుల నుంచి అనుమతి గానీ, వారి తరపున నోటీసులు గానీ అవసరమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల ఆక్రమణదారులకు కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకునే సమయం దొరుకుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం సరికొత్త పంథాను ఎంచుకుంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే, ఏయే ప్రాంతాలు హైడ్రా పరిధిలోకి వస్తాయో.. అక్కడ ఆక్రమణలను గుర్తించడం, నేరుగా నోటీసులు జారీ చేయడం, నిర్ణీత గడువు తర్వాత స్వయంగా కూల్చివేతలు చేపట్టే అధికారం కేవలం హైడ్రాకే ఉంటుంది.

దీనివల్ల కాలయాపన తగ్గి, అక్రమార్కులపై తక్షణ చర్యలకు అవకాశం ఏర్పడుతుంది.హైడ్రాను కేవలం ఒక ఏజెన్సీగా కాకుండా, తిరుగులేని ఇన్ఫోర్స్మెంట్ వ్యవస్థగా మార్చడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. ఇందులో భాగంగా హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, చట్టపరమైన విచారణ జరిపే అధికారులు, సాంకేతిక నిపుణు లతో కూడిన విభాగాన్ని కేటాయించబోతున్నారు. చెరువులు, నాలాలు, పార్కులు ఎక్కడ ఆక్రమణకు గురైనా ఇతర శాఖల నుంచి వచ్చే ఉత్తర్వుల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. చట్టబద్ధంగా హైడ్రానే అన్ని చర్యలు తీసుకుంటుంది.