7 July, 2026 | 4:02 AM

పూరన్‌కు పూనకం

18-05-2024 01:21 AM

ముంబైపై లక్నో ఘనవిజయం 

రోహిత్, నమన్ పోరాటం వృథా 

నామమాత్రంగానైనా ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ సత్తాచాటింది. మొదట బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేసిన లక్నో.. ఆనక బౌలింగ్‌లోనూ రాణించి ముంబైని చిత్తుచేసింది. పూరన్ పూనకం వచ్చినట్లు రెచ్చిపోతే.. రాహుల్ యాంకర్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. వర్షం విరామం అనంతరం పిచ్ కాస్త మందగించగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మెరుపులు జట్టును గెలిపించలేకపోయాయి!

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఏడో విజయం సాధించింది. శుక్రవారం వాంఖడే వేదికగా వర్షం అంతరాయం మధ్య జరిగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. దీంతో లక్నో అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. మరోవైపు లీగ్‌లో 14 మ్యాచ్‌లాడిన ముంబై కేవలం నాలుగింట మాత్రమే నెగ్గి 8 పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితమైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ నికోలస్ పూరన్ (29 బంతుల్లో 75; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) పిడుగుల్లాంటి షాట్లతో మైదానాన్ని హోరెత్తించగా.. తనకు అచ్చొచ్చిన ప్రత్యర్థిపై కేఎల్ రాహుల్ (55; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి రెచ్చిపోయాడు.

దేవదత్ పడిక్కల్ (0), దీపక్ హుడా (11), అర్షద్ ఖాన్ (0) విఫలం కాగా.. మార్కస్ స్టొయినిస్ (28; 5 ఫోర్లు), ఆయుష్ బదోనీ (22 నాటౌట్; ఒక ఫోర్, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించారు. 10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 69 పరుగులతో నిలిచిన లక్నో.. ఆ తర్వాత గేరు మార్చి రాకెట్ వేగాన్ని అందుకుంది. పూరన్ ఎడాపెడా బౌండ్రీలతో రెచ్చిపోగా.. రాహుల్ కూడా చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. ముంబై బౌలర్లలో నువాన్ తుషారా, పియూష్ చావ్లా చెరో 3 వికెట్లు పడగొట్టారు. ముంబైకి ఇది లీగ్‌లో చివరి మ్యాచ్ కాగా.. ఫలితంతో ఎలాంటి ప్రభావం లేకపోవడంతో ఆ జట్టు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించి.. యంగ్ ప్లేయర్స్‌కు అవకాశమచ్చింది. దీంతో బుమ్రా, తిలక్ వర్మ బెంచ్‌కు పరిమితం కాగా.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్, డెవాల్డ్ బ్రేవిస్ జట్టులోకి వచ్చారు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు196 పరుగులు చేసింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (38 బంతుల్లో 68; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో మెరిశాడు. మిగిలిన వాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ముంబైకి పరాజయం తప్పలేదు. నమన్ ధిర్ (28 బంతుల్లో 62; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

సంక్షిప్త స్కోర్లు

లక్నో: 20 ఓవర్లలో 214/6 (పూరన్ 75, రాహుల్ 55; నువాన్ 3/28, పియూష్ 3/29), 

ముంబై: 20 ఓవర్లలో 196/6 (రోహిత్ 68, నమన్ 62 నాటౌట్; రవి బిష్ణోయ్ 2/37, నవీన్ 2/50)

పాయింట్ల పట్టిక 2024

జట్టు మ్యా గె ఫ.తే ర.రే పా

కోల్‌కతా 13 9 3 1 1.42 19

రాజస్థాన్ 13 8 5 0.27 16

హైదరాబాద్ 13 7 5 1 0.40 15

చెన్నై 13 7 6 0.52 14

ఢిల్లీ 14 7 7 14

లక్నో 14 7 7 14

బెంగళూరు 1౩ 6 7 0.38 12

గుజరాత్ 14 5 7 2 12

పంజాబ్ 13 5 8 10

ముంబై 14 4 10 8

నోట్: మ్యా గ్యెగెలిచినవి,ఓ ఫ.తే తేలనివి, ర.రే పా