నా రికార్డులకు ముప్పు లేదు : బోల్ట్
న్యూఢిల్లీ: ఇప్పట్లో నా రికార్డులకు వచ్చిన ముప్పేమి లేదని.. భవిష్యత్తులో కూడా అది కష్టమేనని జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ వ్యాఖ్యానించాడు. అథ్లెటిక్స్‌లో 100 మీటర్లు, 200 మీటర్ల ప్రపంచ రికార్డు బోల్ట్ పేరిటే ఉంది. 2009లో బెర్లిన్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియ న్‌షిప్‌లో బోల్ట్ 100 మీటర్ల రేసును 9.58 సెకన్లు, 200 మీటర్ల రేసును 19.19 సెకన్లలో పూర్తి చేసి సరికొత్త చరిత్ర లిఖించాడు. 15 ఏళ్ల కిందట బోల్ట్ నమోదు చేసిన ఈ రికార్డులు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. దీనిపై బోల్ట్ స్పందిస్తూ.. ‘ఇప్పటికిప్పుడు నా రికార్డులకు వచ్చిన ముప్పు ఏం లేదు. ఎంతమంది ప్రయత్నించినా వాటి దరిదాపుల్లోకి రాలేకపోయారు. ఇప్పటికీ ఆ రికార్డులు చెక్కు చెదరలేదు. అవి బద్దలవ్వాలంటే ఇంకా కొన్నేళ్ల నిరీక్షణ తప్పదేమో’ అని నవ్వుతూ వెల్లడించాడు.






