మధ్యాహ్న భోజన పథకాన్ని డిగ్రీ వరకు విస్తరించాలి
- ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ తీరునహరి శేషు
హనుమకొండ,(విజయక్రాంతి): ప్రభుత్వ విద్యాసంస్థలలో హాజరు శాతాన్ని పెంచడానికి, పేద విద్యార్థులకు పౌష్టికాహార స్థాయిని పెంచటానికి ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకాన్ని డిగ్రీ వరకు విస్తరించాలని ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు లేఖ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాల లకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీల కు కూడా వర్తింపజేయాలని ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో ప్రకటించటాన్ని స్వాగతిస్తున్నామని, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 149 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా విస్తరించటం వలన మరింత ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
రాష్ట్రంలో ఉన్న 90 శాతం డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు తక్కువగా ఉండటమే కాకుండా, విద్యార్థులు హాజరు శాతం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి డిగ్రీ కళాశాలలో కూడా హాజరు శాతాన్ని పెంచటానికి మధ్యాహ్న భోజన పథకాన్ని డిగ్రీ కళాశాలలకి విస్తరించాలని ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సుమారు 89 వేల సీట్లు అందుబాటులో ఉంటే ఈ విద్యా సంవత్సరంలో కేవలం 27 వేల విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ పొందుతున్నారని, విద్యాశాఖ మంత్రిగా ఈ ప్రతిపాదనపై సాధ్యసాధ్యులను అవసరాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.




