అక్కడ దళారులదే హవా..
- రైతుల పేరుతో మార్క్ ఫెడ్‌కు వ్యాపారుల అమ్మకాలు
- కొనుగోలు కేంద్రాల్లో రాజకీయ నాయకుల జోక్యం
ఉట్నూర్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ఉట్నూర్ డివిజన్ పరిధిలోని ఇంద్రవెల్లి మార్కెట్ యార్డులో మొక్కజొన్న పంటల కొనుగోలు కేంద్రంలో దళారుల హవా కొనసాగుతుంది. ఇంద్రవెల్లి మార్కెట్ యార్డులో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో పిఎసిఎస్ పర్యవేక్షణలో సోమవారం నుండి మొక్కజొన్న పంట లు కొనుగోలు ప్రారంభించారు. మొక్కజొన్న పంటల కొనుగోలు కేంద్రంలో రైతుల దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసి అదే రైతు పేరు మీద ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్ రూ. 2400 వందలకు విక్రయిస్తున్నారు.
రైతుల వద్ద క్వింటాల్‌కు రూ. 1600 నుంచి 1800 చెల్లించి కొనుగోలు చేసిన మొక్కజొన్న పంటలను మార్కెట్ యార్డుకు నేరుగా తరలించి ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రైతులు తీసుకువచ్చిన పంటలను కొనుగోలు కేంద్రంలో అధికారులు పలు కొర్రీలు పెట్టి కొనుగోలు చేసేందుకు వెనుకా ముందు చేస్తున్నారు. రైతుల పేరుతో వ్యాపారులు తీసుకొచ్చిన పంటలను ఎలాంటి కొర్రీలు లేకుండా వెంటనే తూకం చేసి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
ఇంద్రవెల్లి మార్కెట్ యార్డులో మొక్కజొన్న పంటల కొనుగోలుకు వివిధ రాజకీయ పార్టీ నాయకులు వ్యాపారులకే వత్తాసు పలుకుతున్నారని రైతులు వాపోతున్నారు. ఇంద్రవెల్లి మార్కెట్ యార్డులో కొనుగోలు చేసే మొక్కజొన్న పంటలపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘ ఏర్పాటు చేస్తే వ్యాపారులకు వత్తాసు పలికే రాజకీయ నాయకులతో పాటు రైతులను మోసం చేస్తున్న వ్యాపారులు సైతం బయటకు వస్తారని రైతులు అంటున్నారు. ఇంద్రవెల్లి మార్కెట్ యార్డ్‌లో కొనుగోలు చేసే పంటలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రైతులు అధికారులను కోరుతున్నారు..
పక్క రాష్ట్రం నుంచి తీసుకువచ్చే..
ఇంద్రవెల్లి మార్కెట్ యార్డులో ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న మొక్కజొన్న పంటలను ఇక్కడే పండించినట్లు ఇక్కడి రైతుల పేరుతో మద్దతు ధరకు విక్రయించుతున్నారు. రబ్బి సీజన్‌లో తక్కువ మోతాదు లో మొక్కజొన్న పంటలను సాగు చేసిన రైతు ల పేర్లతో మొక్కజొన్న పంటలను విక్రయించేందుకు ఇక్కడి వ్యాపారులు ఒక అడుగు ముందుకేసి పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి దిగుమతి చేస్తున్నారు. పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుండి ప్రత్యేక వాహనాల్లో తీసుకువచ్చే మొక్కజొన్న పంటలను ఈ ప్రాంత రైతుల పేరుతో మద్దతు ధరకు పంటలో వికరించడంతో క్వింటాల్‌కు రూ.400 నుంచి 600 వరకు లాభం పొందుతున్నారని రైతులు వా పోతున్నారు.
ఈ రోజైనా కొనుగోలు చేస్తారో లేదో..
రబీ సీజన్ సాగు చేసిన మొక్కజొన్న పంటను సోమవారం ఉదయం మార్కె ట్ యార్డ్‌కు తీసుకొచ్చిన. నా తర్వాత వ్యాపారులు రైతుల పేరుతో తీసుకువచ్చిన మొక్కజొన్న పం టలను ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేశారు. సోమవారం రాత్రి అంతా మొక్కజొన్న పంటకు కాపలా గా పడుకున్నాను. ఈ రోజైనా కొనుగోలు చేస్తారో లేదో అన్న బెంగ ఉంది. పంట సాగు చేసిన రైతుల పేరుతో వ్యాపారులు అమ్మే పంటకు కొనుగోలుదారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. పంటలు సాగు చేసిన రైతుల పంటను ముందుగా కొనాలి.
మిర్జా నౌసాద్ బేగ్, కేస్లగూడ, ఇంద్రవెల్లి మండలం రైతుల పంటలను కొంటున్నాం..
ఇంద్రవెల్లి మార్కెట్ యార్డులో మొక్కజొన్న పంటలను తీసుకువచ్చిన రైతుల వద్దనే కొనుగోలు చేస్తున్నాం. ఆన్లైన్లో రైతుల వేలిముద్రలు తీసుకుంటున్నాం. వ్యాపారులు వచ్చేది తమకు తెలియదు. రైతుల పటేల్ పాస్ పుస్తకం పేరుతోనే కొనుగోలు చేసినట్లు నమోదు చేస్తున్నాం.
తుమ్మల సునీల్, కొనుగోలు కేంద్రం ఇంచార్జి






