29 April, 2026 | 2:16 AM

సమన్వయంతో చర్యలు తీసుకోవాలి

29-04-2026 12:05 AM

అధికారులకు కలెక్టర్ హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): జిల్లాలో వేసవికాలంలో త్రాగు నీటి కొరత లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హరిత ఆదేశించారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి  జూమ్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు.

గ్రామాల్లో చేతి పంపులు, బోర్వెల్లు, పైప్లైన్ల మరమ్మత్తులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. మిషన్ భగీరథ నీరు అందని మారుమూల గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, అవసరమైతే గ్రామ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలని తెలిపారు. చేతి పంపులు ఎండిపోతే వ్యవసాయ బావులు, పంపుసెట్లను గుర్తించి యజమానులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందేలా అధికారులు కృషి చేయాలని, నీటి సరఫరా వివరాలను లాగ్బుక్లో నమోదు చేయాలని ఆదేశించారు.

ఎక్కడైనా త్రాగునీటి సమస్య తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేయాలని, బీఎల్‌ఓలకు పంచాయతీ కార్యదర్శులు సహకరించాలని సూచించారు.జనాభా గణనలో భాగంగా స్వీయ గణన ప్రక్రియపై గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ దత్తారావు, మిషన్ భగీరథ ఈఈ సిద్ధిక్, గ్రేడ్ ఈఈ రాకేష్, డీఎల్పీవో ఉమర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌గా యువరాజ్ మార్మట్ బాధ్యతలు

జిల్లాకు నూతనంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా నియమితులైన యువరాజ్ మార్మట్ మంగళవారం సమీకృత కలెక్టరేట్ భవనంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ హరితను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఆయన తన చాంబర్లో అదనపు కలెక్టర్గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా యువరాజ్ మార్మట్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. జిల్లా పౌర సంబంధాల అధికారి వై. సంపత్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి కిరణ్ కుమార్ పాల్గొని నూతన అదనపు కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.