హాట్ వాటర్ సంప్ లో పడి వలస కార్మికుడి మృతి
జాగృతి స్టీల్ పరిశ్రమలో వ్యక్తి దుర్మరణం
షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికుడి మృత దేహం
షాద్‌నగర్ ఏప్రిల్ 25 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలం వీర్లపల్లి గ్రామ శివారులో గల జాగృతి స్టీల్ పరిశ్రమలో శుక్రవారం ప్రమాదవశాత్తు మధ్యప్రదేశ్ రాష్ట్రం మాండ్లా జిల్లాలోని గౌరాచావర్ తాలూకా ముర్లిటోల గ్రామానికి చెందిన ఉమేష్ (27) అనే కార్మికుడు మృతి చెందాడు. పరిశ్రమలో స్టిల్ ను కూల్ చేయడానికి వాడిన నీరు వెళ్ళే సంప్ (హాట్ వాటర్ సంప్) లో ప్రమాదవశాత్తు పరిశ్రమలో హెల్పర్ గా పనిచేస్తున్న కార్మికుడు ఉమేష్ పడిపోవడంతో మృతి చెందాడని తెలుస్తుంది.
ఈ విషయాన్ని గమనించిన పరిశ్రమ యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా కార్మికుడి మృతదేహాన్ని షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పరిశ్రమలో ఉన్న హాట్ వాటర్ సంపు చుట్టు గ్రిల్స్ ఏర్పాటు చేయకపోవడంతోనే కార్మికుడు ఉమేష్ ప్రమాదానికి గురయ్యాడని, ముందు జాగ్రత్తగా భద్రతా ప్రమాణాలు పాటించి ఉంటే ఈ విధంగా కార్మికుడు బలయ్యే వాడు కాదనే చర్చ జరుగుతుంది. నిత్యం పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు వలస కార్మికులు కావడంతో ప్రతి సంఘటనలో ఆయా కార్మికుల కుటుంబ సభ్యులతో పరిశ్రమ యాజమాన్యాలు రాజీ కుదుర్చుకుని చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. వీర్లపల్లి గ్రామంలోని జాగృతి స్టీల్ పరిశ్రమలో జరిగిన సంఘటనపై నందిగామ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది.






