1 August, 2026 | 2:34 AM

స్పెయిన్‌లోకి 60,000 మంది చొరబాటు

01-08-2026 01:50 AM

మొరాకో నుంచి వలసలు

సముద్రంలో ఈదుకుంటూ వస్తూ 57 మంది మృతి

చొరబాటు దారులను వెంటనే వారి దేశాలకు పంపొద్దన్న స్పెయిన్ కోర్టు

ఇదే.. అదునుగా భావించి స్పెయిన్‌లోకి చొరబాట్లు

సెటా, జూలై ౩౧: స్పెయిన్‌లోని సెటా పట్టణంలోకి మొరాకా నుంచి భారీగా చొరబాట్లు ప్రారంభమయ్యాయి. కేవలం 24 గంటల వ్యవధిలో 60,000 మంది వలస వచ్చారు. సముద్ర జలాలను ఈదుకుంటూ వచ్చే ప్రయత్నంలో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. సముద్ర జలాల్లో పట్టుబడిన వలసదారులను తక్షణం వెనక్కి పంపకూడదంటూ స్పెయిన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చొరబాట్లకు కారణమైంది. కోర్టు తీర్పును కొన్ని అక్రమ మానవ రవాణా ముఠాలు క్యాష్ చేసుకుని మొరాకో దేశస్తులను స్పెయిన్ వైపు ఉసిగొల్పాయి.

కేవలం 83,000 జనాభా ఉండే సెటా పట్టణంలోకి భారీ వలసలు రావడం కలకలం రేపింది. ఆఫ్రికా ఖండంలో భాగమైన మొరాకాను పేదరికం, నిరుద్యోగం, రాజకీయ అస్థిరత అక్కడి ప్రజలను పట్టిపీడిస్తున్నది. దీంతో ఆ దేశం పొరుగునే ఉన్న ఐరోపా ఖండంలోని స్పెయిన్ వైపు చూస్తున్నారు. దీనికి తోడు అల్జీరియాతో స్పెయిన్ సంబంధాలు బలపడటంపై మొరాకో అసంతృప్తిగా ఉంది. అందుకే.. స్పెయిన్‌లోకి వలసలు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు, వలసలను కట్టడి చేసేందుకు స్పెయిన్ త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. చొరబాటుదారులందర్నీ ఒకేచోటికి చేర్చే ప్రయత్నంలో ఉన్నాయి. అక్కడి యంత్రాంగం చొరవతో వలస వచ్చిన వారిలో 25,000 మంది స్వచ్ఛందంగా తిరిగి మొరాకోకు వెళ్లేందుకు అంగీకరించినట్లు తెలిసింది. వలసలపై స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ తీవ్రంగా స్పందించారు. వలసలు తమ దేశ సమగ్రతపై జరిగిన దాడి అంటూ అభివర్ణించారు. చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారిని తిరిగి పంపిస్తామని స్పష్టం చేశారు.