21 ఏళ్లకే ‘అధ్యక్షా’ సాధ్యమేనా?
ఎ.చంద్రశేఖర్‌రావు :
డిగ్రీ పట్టా చేతికి వచ్చే వయసులో.. శాసనసభ లేదా లోక్‌సభ సీటు దక్కించుకునే అర్హత లభిస్తే ఎలా ఉంటుంది? వినడానికి ఇది బాగానే ఉంది. కానీ, 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీచేసే అవకాశం కల్పిస్తూ తెలంగాణ సర్కార్ తీసుకురావాలనుకుంటున్న ప్రతిపాదన వినడానికి విప్లవాత్మకంగానే ఉన్నా..
దీని వెనుక అసలు కథ వేరే ఉందనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ నిర్ణయం వెనుక దాగి ఉన్న రాజ్యాంగపరమైన చిక్కులు, లొసుగులు, చట్టసభలను నడిపే పరిణతిపై వస్తున్న ప్రాక్టికల్ సవాళ్లు.. ఇది సాధారణ యువత కంటే ‘రాజకీయ వారసులకే’ వరంగా మారబోతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రతిపాదించిన ‘ఎన్నికల పోటీ వయోపరిమితిని 25 నుంచి 21 ఏళ్లకు కుదించడం’ అనే అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపింది. ఆగస్టు మొదటి వారంలో రాష్ట్ర అసెంబ్లీలో ఇందుకు సంబంధించి ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత పాత్రను పునర్నిర్వచించే దిశగా పడిన ఒక సాహసోపేతమైన అడుగని స్పష్టమవుతోంది.
రాజీవ్‌గాంధీ విప్లవాత్మక నిర్ణయం
1988 కంటే ముందు భారతదేశంలో ఓటుహక్కు రావాలంటే కనీసం 21 ఏళ్లు నిండాలి. కానీ, దేశ జనాభాలో సగభాగంగా ఉన్న యువతకు దేశ భవిష్యత్తును నిర్ణయించే హక్కు ఉండాలని దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ బలంగా నమ్మారు. దీనికోసం 61వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, విజయవంతంగా ఆమోదింపజేశారు. ఈ చట్టం 1989 మార్చి 28 నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది.
దీని ద్వారా ఓటింగ్ వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. ‘దేశ యువతపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వారు 18 ఏళ్లకే ఐఏఎస్ చదవగలరు, సరిహద్దుల్లో తుపాకీ పట్టి దేశాన్ని రక్షించగలరు, పెళ్లి చేసుకొని సంసారాన్ని నడపగలరు. అలాంటప్పుడు తమ నాయకుడిని ఎన్నుకునే విచక్షణ వారికి ఎందుకు ఉండదు?’ అని నాడు పార్లమెంట్ సాక్షిగా రాజీవ్‌గాంధీ ప్రశ్నించారు. ఇది భారత రాజకీయాల్లో ఒక నిశ్శబ్ద విప్లవానికి దారితీసింది.
స్థానిక సంస్థల్లో 21 ఏళ్లకే పోటీ
రాజీవ్‌గాంధీ హయాంలోనే స్థానిక సంస్థల (పంచాయతీరాజ్, మున్సిపాలిటీలు) బలోపేతానికి ముసాయిదా సిద్ధమైంది. ఆ తర్వాత వచ్చిన పి.వి.నరసింహారావు ప్రభుత్వం 1992లో 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా దీనిని చట్టబద్ధం చేసింది. దీని ద్వారా గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్, మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులకు పోటీచేసే కనీస వయస్సును 21 ఏళ్లుగా నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్లే ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతీ యువకులు 21 ఏళ్లకే సర్పంచులుగా, కౌన్సిలర్లుగా ప్రజాసేవలోకి రాగలుగుతున్నారు.
1989లో ఓటుహక్కు పొందే వయసు 18 ఏళ్లకు తగ్గింది. 1992లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే వయసు 21 ఏళ్లకు తగ్గింది. ఇప్పుడు సరిగ్గా 35 ఏళ్ల తర్వాత, అదే స్ఫూర్తితో అసెంబ్లీ, లోక్‌సభకు పోటీచేసే వయసును కూడా 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
నాటి రాజీవ్ గాంధీ ఆలోచనా విధానాన్నే రేవంత్ రెడ్డి ఇప్పుడు రీ-బ్రాండ్ చేస్తున్నారు. 21 ఏళ్లకే ఒక యువకుడు ఐఏఎస్ అధికారిగా ఒక జిల్లాను పాలించగలిగినప్పుడు, కార్పొరేటర్ లేదా సర్పంచ్‌గా ఒక ఊరిని ఏలగలిగినప్పుడు.. ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గాన్ని ఎందుకు నడపలేడు? అనేదే ఈ ప్రతిపాదన వెనుక ఉన్న అసలు తర్కం.
తీర్మానానికి చట్టబద్ధత ఉందా?
ఆర్టికల్ 173(బి) ప్రకారం అసెంబ్లీకి పోటీచేసే వయసును, ఆర్టికల్ 84(బి) ప్రకారం లోక్‌సభకు పోటీచేసే వయసును నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి (పార్లమెంట్) మాత్రమే ఉంది. రాష్ట్ర అసెంబ్లీ చేసే తీర్మానం ఒక ‘సిఫారసు’ మాత్రమే అవుతుంది. కేంద్రం దీనిని ఆమోదించాల్సిన చట్టపరమైన నిబంధన ఏదీ లేదు. వయోపరిమితి మార్చాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ కావాలి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఈ అంశం లేదు కాబట్టి, రాష్ట్ర తీర్మానం ఢిల్లీ ఫైళ్లలోనే ఉండిపోయే ప్రమాదం ఉంది.
యువత చట్టసభలను నడపగలదా?
సీఎం రేవంత్ రెడ్డి ‘21 ఏళ్లకే ఐఏఎస్ అయినప్పుడు ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు?’ అని ప్రశ్నించారు. కానీ, బ్యూరోక్రసీకి, రాజకీయాలకు చాలా తేడా ఉంది. ఒక 21 ఏళ్ల ఐఏఎస్ అధికారి వెనుక దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ అధికారులు, నిర్దిష్ట చట్టాల గైడ్‌లైన్స్ (రూల్ బుక్) ఉంటాయి. కానీ, ఎమ్మెల్యే పదవికి ఎలాంటి రూల్ బుక్ ఉండదు.
క్షేత్రస్థాయిలో తీవ్రమైన ప్రజా సమస్యలు, కుల-మత సమీకరణాలు, శాంతిభద్రతల వంటి క్లిష్టమైన సమస్యలను 21 ఏళ్ల వయసులో (డిగ్రీ పూర్తిచేసే వయసు) ఎదుర్కోవడం, అన్ని వర్గాలు, అధికారులు, ప్రజలను సమన్వయం చేయడం మానసికంగా, సామాజికంగా పెద్ద సవాలు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజకీయ వారసత్వానికి పునాది!
నేటి ఎన్నికల వ్యవస్థలో కోట్లాది రూపాయల ఖర్చు ఉంటోంది. 21 ఏళ్ల యువకుడికి సొంతంగా ఆర్థిక వనరులు ఉండవు. ఫలితంగా, రాజకీయ వారసులు మాత్రమే ఈ వయసులో టికెట్లు తెచ్చుకోగలుగుతారు. దీనివల్ల సాధారణ మధ్యతరగతి యువతకు కాకుండా, ‘రాజకీయ కుటుంబాల వారసత్వ శకం’ మరింత త్వరగా ప్రారంభమయ్యే ప్రమాదం ఉంది. ఇతర చట్టాలలోనూ అనేక వైరుద్ధ్యాలు ఉన్నాయి.
భారతదేశంలో వివిధ చట్టాల ప్రకారం ‘వయోజనుడు.. బాధ్యతాయుత పౌరుడు’ అనే దానికి వేర్వేరు వయోపరిమితులు ఉన్నాయి. ఒక యువకుడు 21 ఏళ్లకే ఎమ్మెల్యే అయితే, అతనికి సివిల్ కాంట్రాక్టులు సంతకం చేసే పరిణతి ఉందా, లేదా? అనే వివాదాలు వస్తాయి. భారతదేశంలో ఓటుహక్కు 18 ఏళ్లకు వస్తుంది. చట్టసభలకు పోటీచేసే హక్కు 25 ఏళ్లుగా ఉంది. ఈ ఏడేళ్ల వ్యత్యాసాన్ని నాలుగేళ్లకు తగ్గించడం వల్ల యువతలో రాజకీయ అవగాహన పెరుగుతుందనేది సానుకూల అంశం.
అయితే, ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా బ్రిటన్, జర్మనీ వంటి దేశాల్లో 18 ఏళ్లకే ఎన్నికల్లో పోటీచేసే హక్కు ఉంది. మన దేశంలో కనీసం 21 ఏళ్లకు తగ్గించినా, అది ఒక ముందడుగు అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఈ తీర్మానం ఒక మంచి ఆలోచనే అయినప్పటికీ, ఇది చట్టరూపం దాల్చాలంటే కేంద్రంలో ఉన్న రాజకీయ సంకల్పం మీదనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కేంద్రం దీనిని ఆమోదిస్తే, చట్టసభల్లో నిజమైన ‘జెన్ -జీ’ విప్లవం వస్తుంది. లేదంటే ఇది కేవలం యువ ఓటర్లను ఆకర్షించేందుకు వేసిన ఒక ‘రాజకీయ వ్యూహం’గానే మిగిలిపోతుంది.
వ్యాసకర్త: ఉమ్మడి మెదక్ జిల్లా బ్యూరో ఇంచార్జ్,
విజయక్రాంతి






