వలస కష్టాలు మొదలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన నాటినుంచే ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. అధికారం చేపట్టి నెల రోజులుకూడా కాకముందే అమెరికా చరిత్రలోనే అతిపెద్ద అక్రమవలసదారుల బహిష్కరణ ఆపరేషన్ చేపట్టారు.
దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి ఆయా దేశాలకు సైనిక విమానాల్లో పంపిస్తున్నారు. తాజాగా మంగళవారం భారత్‌కు చెందిన అక్రమవలసదారులతో కూడిన ఓ మిలిటరీ విమానం బయలుదేరింది. టెక్సాస్‌నుంచి అమృత్‌సర్‌కు బయలుదేరిన ఈ విమానంలో 205 మంది భారతీయులు ఉన్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.
రాబోయే రోజుల్లో మరిన్ని విమానాలు ఇలా అక్రమంగా ఉంటున్న భారతీయులను స్వదేశానికి తరలించనున్నట్లు తెలుస్తోంది. అక్రమ వలసదారులపై అమెరికా విధానాలపై భారత్ విదేశాంగ శాఖ కూడా గతంలోనే స్పందించింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, వీసా గడువు ముగిసినా లేదా సరైన పత్రాలు లేకుండా భారతీయులు అమెరికా సహా ఎక్కడ ఉన్నా వెనక్కి తీసుకు వచ్చేందుకు వీలు కల్పిస్తామని ఇప్పటికే స్పష్టం చేసింది.
అమెరికాలో సరయిన పత్రాలు లేకుండా భారతీయులు దాదాపు 7.25 లక్షల మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 18వేల మందిని ప్రస్తుతానికి భారత్‌కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం జాబితా సిద్ధం చేసింది. అయితే ఇది ఏడాది క్రితం రూపొందించిన జాబితా. ఇప్పడు ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చు.
భారత్‌కు చెందిన వారినే కాకుండా గ్వాటెమాల, పెరూ, హోండురాస్ లాంటి పలు దేశాలకు చెందిన వేలాదిమందిని ఇప్పటికే తరలించింది. అయితే ఒక్కో వలసదారుడ్ని తరలించేందుకు అమెరికాకు భారీగా ఖర్చవుతున్నట్లు సమాచారం. గత వారం గ్వాటెమాలకు తరలించిన ఒక్కో వ్యక్తిపై సుమారు 4,765 డాలర్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
మామూలు చార్టర్ విమానాల్లో కాకుండా సైనిక విమానాల్లో తరలించడమే దీనికి ప్రధాన కారణం. అయితే ఇలా అక్రమంగా వలస వచ్చిన వారిని ట్రంప్ నేరస్థులు, టెర్రరిస్టులుగా పరిగణిస్తున్నారు. అందుకే కఠిన చర్యలు తీసుకొంటున్నారు.
అయితే ఇలా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులంతా నేరగాళ్లేనా? అంటే కాదనే చెప్పాలి. ఇంజినీర్లు, డాక్టర్లు, నర్సులు.. ఇలా రకరకాల వృత్తులకు చెందిన వారున్నారు. మొదట కెనడా లాంటి అమెరికా సరిహద్దు దేశాల్లో అడుగు పెట్టి , అటునుంచి అమెరికాలోకి ప్రవేశించిన వారే ఎక్కువ మంది.
ఇందుకోసం ఆస్తులు తెగనమ్మి, ఏజంట్లకు లక్షల కొద్దీ సొమ్ము చెల్లించిన వారే. ఇక మరికొంత మంది విజిటింగ్ వీసాలు, టూరిస్టు వీసాలపై వెళ్లి అక్కడే ఉండిపోతున్నారు. తగిన పత్రాలు లేక పోవడంతో వీరిలో ఎవరికీ గుర్తింపు ఉండదు. ఫలితంగా సరైన ఉద్యోగాలు ఉండవు.
రెస్టారెంట్లు, పెట్రోలు బంకులు, ధనవంతుల ఇళ్లలో పనివాళ్లు ఇలా రకరకాల రోజువారీ ఉద్యోగాలు చేస్తుంటారు. ఇవేవీ కూడా అమెరికన్లు చేయడానికి ఇష్టపడని పనులే. దీంతో అక్కడి ‘ప్రవాసీలు’ కూడా ఇలాంటి వారికి సాయం చేస్తుంటారు. ప్రస్తుతానికయితే వీరందరినీ తిప్పి పంపడంవల్ల అమెరికా ఆర్థిక, సామాజిక వ్యవస్థలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో ఓ పెద్ద సమస్యే కావచ్చు.
ఎందుకంటే ఒక్కసారిగా లక్షల మంది వెళ్లిపోతే అమెరికన్ల దైనందిన జీవితంలో పెనుమార్పులే రావచ్చు. ఇక అమెరికా యూనివర్సిటీల్లో చదివే భారతీయులు కూడా తమను ఎక్కడ తిప్పి పంపిస్తారోనన్న భయం తో అదనపు ఆదాయం కోసం నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న పార్ట్‌టైమ్ ఉద్యోగాలు వదిలేసుకుంటున్నట్లు సమాచారం.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12 నుంచి అమెరికాలో మూడురోజులు పాటు పర్యటించనున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. మిత్రు డు ట్రంప్‌తో మోదీ జరిపే చర్చల్లో ఈ సమస్యకు ఏదయినా పరిష్కారం లభిస్తుందేమో చూడాలి. అలాకాని పక్షంలో లక్షలాది మంది భారతీయుల అమెరికా కల చెదిరినట్లే.






