27 April, 2026 | 2:17 PM

ఆకాశమే హద్దుగా!

05-02-2025 12:00 AM

ఇటీవల స్కాట్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భద్రాచలం కు చెందిన అద్భుత క్రీడాకారిణి గొంగడి త్రిష ‘భారత అండ ర్‌ఫూ19 టి20’ ప్రపంచకప్ క్రికెట్ జట్టులో ఆల్‌రౌండర్‌గా అసాధారణ ప్రతిభ ప్రదర్శించారు. 59 బంతుల్లో 110 పరుగులు చేయడమేకాక మూడు వికెట్లనూ పడగొట్టి భారత్‌కు తిరుగులేని విజయం తెచ్చారు.

తర్వాత మ్యాచ్‌లలోనూ తన సత్తా చాటారు. దేశానికి కప్ అందించడంలో ప్రధాన భూమి క పోషించడం హర్షదాయకం. అదే విధంగా, వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జివాంజీ 2024 సెప్టెంబర్‌లో జరిగిన ‘ప్యారిస్ పారాలింపిక్స్’లో 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం గెలిచారు.

ఇటీవల భారత ప్రభుత్వంతో పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు. క్రీడారంగంలో రాణించిన బాలికలు, మహిళల సంఖ్య నిజానికి వేళ్లపై లెక్కిం చే స్థాయిలోనే ఉంటుండడం బాధాకరం. 

మన దేశవ్యాప్తంగా లింగ వివక్ష ఇప్పటికింకా కొనసాగుతున్నది. బాలికలను, మహిళలను క్రీడలవైపు ఆకర్షించడానికి ఏటా ఫిబ్రవరి 5న ‘జాతీయ బాలికల, మహిళా క్రీడల దినం’ (నేషనల్ గర్ల్ అండ్ వుమెన్ స్పోర్ట్స్ డే) నిర్వహించుకుంటాం.

దీనిని 1987 నుంచి జరుపుకుంటున్నారు. క్రీడలపట్ల ఆసక్తిగల బాలికలు, మహిళలను ప్రోత్సహించడం, సరైన శిక్షణతో నైపుణ్యాలను పెంపొందించడం వంటి కార్యక్రమాలే లక్ష్యం గా ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటాం. 

క్రీడలతో బాలిక లు, మహిళలకు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, స్థిరత్వం, క్రీడాస్ఫూర్తి, శారీరక -మానసిక పటుత్వం, సంపూర్ణ ఆరోగ్యం, సమాజ గుర్తింపు, ఉద్యోగాలు, అవార్డులు వంటివి ఒనగూడుతాయి. పాఠశాల దశలోనే బాలికలను క్రీడలపట్ల ఆకర్షితులను చేయాల్సి ఉంది. వారి ఆసక్తి మేరకు కోచింగ్ ఇస్తూ నైపుణ్యాలకు మెరుగు పరచాల్సి ఉంటుంది.

రాష్ర్ట, జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటీల్లో పాల్గొనే విధంగా వారిని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేయడం మనందరి కర్తవ్యంగా గుర్తించాలి. క్రీడాకారిణిలు ఆటస్థలంలో నేర్చుకున్న క్రీడాస్ఫూర్తి తమ జీవిత కాలంలోనూ నిలదొక్కుకోవడానికి, విజేతలుగా నిలవడానికి దోహదపడతుంది.

క్రీడారంగంలోని బాలికలు, మహిళలపట్ల సమాజంలో చిన్నచూ పు, వివక్ష తొలగించుకోవాలి. ఎందరో మహిళలు, బాలికలకు ప్రోత్సాహం కరువవుతున్నది. తల్లితండ్రులు, పౌర సమాజం వారిని ప్రోత్సహిస్తే మనకు మరో పీవీ సింధు లేదా కరణం మల్లేశ్వరిల వారసులు తప్పక లభిస్తారు. 

 డా. బుర్ర మధుసూదన్‌రెడ్డి