20 July, 2026 | 6:53 PM

Breaking News

నూతన ఎస్‌ఐ అనిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉపసర్పంచ్   •   విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి: షీటీం ఎస్ఐ ఫజల్ ఖాన్   •   మితిమీరిన వేగంతో డ్రైవింగ్... కారు బోల్తా యువకుడు మృతి   •   నీట్ పేపర్ లీక్ - కేంద్ర మంత్రి రాజీనామాకు పీవైఎల్ డిమాండ్   •   ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలి: డాక్టర్ వై. అనూప్ రావు   •   కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు పెద్దపీట - కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్   •   కెల్లేడులో సర్ శత శాతం పూర్తి   •   ఉపసర్పంచులకు విబి జీ రామ్ జీ జాయింట్ చెక్ పవర్ అమలు చేయాలి   •   అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   రైతులు ఆరుతడి పంటలు వేయాలి   •  

భూ రీ-సర్వే జాప్యంపై మంత్రి ఆగ్రహం

20-07-2026 01:00 AM
  1. గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
  2. అటవీరెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారంపై దృష్టి

బూర్గంపాడు, జులై 19,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం సారపాకలోని ఐటీసీ అతిథిగృహంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రీ-సర్వే, అటవీరెవెన్యూ భూ సమస్యలు, పోడు భూములు, పాల్వంచ శ్రీనివాసగుట్ట అభివృద్ధిపై సమీక్షించారు.

జిల్లాలో 70 గ్రామాల్లో రీ-సర్వే చేపట్టగా ప్రస్తుతం 14 గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయని, వాటిలో ఐదు గ్రామాల్లో పూర్తయ్యాయని అధికారులు వివరించారు. మిగిలిన గ్రామాల్లో కూడా నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పాల్వంచలో రీ-సర్వే పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, జాప్యం, నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు.

అవసరమైన సర్వేయర్లు, సాంకేతిక సిబ్బంది, రోవర్ పరికరాలను అందుబాటులో ఉంచి పారదర్శకంగా సర్వే నిర్వహించాలని సూచించారు.అటవీరెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు.

సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి చట్టబద్ధంగా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రతి నెలా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కొత్తగా పోడు సాగు జరగకుండా చర్యలు తీసుకోవాలని, గతంలో పోడు సాగు చేసిన వారి సమస్యలను ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పరిశీలించాలని సూచించారు.

శ్రీనివాసగుట్ట అభివృద్ధికి ప్రణాళిక

పాల్వంచ శ్రీనివాస గుట్టలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు సులభంగా చేరుకునేలా రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. శ్రీనివాసగుట్టను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

సమావేశంలో జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్రాజు, డీఎఫ్వో సిద్ధార్థ విక్రమ్సింగ్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ,అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి, కొత్తగూడెం ఆర్డీవో మధు, డివిజనల్ అటవీ అధికారులు, రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.