గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలి
- మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి
చెన్నూర్,(విజయక్రాంతి): గోదావరి పుష్కరాల నిర్వహణకు పూర్తి కార్యచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండల కేంద్రంలోని గోదావరి నది తీరంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూర్ తహసిల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, దేవాదాయ, విద్యుత్, రహదారులు భవనాల శాఖల అధికారులు, సంబంధిత అధికారులతో పుష్కర ఘాట్ ఏర్పాటు పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు దక్షిణాది కుంభమేళా తరహాలో ఉంటాయని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గోదావరి నది పరివాహకంలో అనువైన ప్రాంతాలలో పుష్కరాల ఏర్పాట్ల కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, ప్రజా రవాణా వ్యవస్థ, పుష్కర ఘాట్ ప్రాంతాలలో లైటింగ్, త్రాగునీటి ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ ఏర్పాట్లలో భాగంగా చెన్నూర్ పట్టణంలోని మహంకాళి కాలనీ నుంచి పుష్కర ఘాట్ వరకు నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.
పుష్కరాలలో భక్తుల సంఖ్య అంచనా ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని, వెలుతురు, పారిశుద్ధ్యం అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. భక్తుల సంరక్షణ దిశగా పుష్కర స్నానాల ప్రాంతాలలో ముందస్తు అప్రమత్తత చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి నది తీర ప్రాంతాలలో పుష్కరాల కోసం ప్రభుత్వం రూ. 500 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించిందని, క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి పుష్కరాలను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిర్వహించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. చెన్నూర్ పట్టణంలో స్మశాన వాటిక ఏర్పాటు కొరకు కోటి రూపాయలు కేటాయించామన్నారు.
అభివృద్ది పనులను పరిశీలించిన మంత్రి...
చెన్నూర్ మండల కేంద్రంలో చేపట్టిన ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను మంత్రి వివేక్ వెంకట స్వామి తిరిగి పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పట్టణంలో కొనసాగుతున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను, ఆర్.టి.సి. బస్ డిపో ఏర్పాటులో భాగంగా కొనసాగుతున్న పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




