27 July, 2026 | 11:13 PM

మంత్రి జూపల్లిని బర్తరఫ్ చేయాలి

30-05-2024 01:49 AM

మద్యం కంపెనీ అనుమతుల విషయం మంత్రికి తెల్వదా?

తన పరిధిలోకి రాదనడం బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్య 

బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ 

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో సోమ్ డిస్టల్లరీస్ కంపెనీకి బేవరేజెస్ కార్పొరేషన్ అనుమతులు ఇచ్చిందని, దాని కార్యకలపాలు తన పరిధిలోకి రావం టూ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన ప్రకటనపై బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. నకిలీ మద్యానికి పేరుగాంచిన సోమ్ కంపెనీ తెలంగాణలో వ్యాపారం పెడుతుంటే కనీసం సమాచారం లేదని అనడం బాధ్యతరహితమన్నారు. ఈ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు ఆ కంపెనీ మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలన్నారు.

ఆయన మంత్రిగా కొనసాగితే ఈ విచారణపై రాజకీయ ఒత్తిడి పెట్టే అవకాశం ఉందని, ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు. లేకుంటే ఈ డీల్‌లో సీఎం పాత్ర ఉందని భావిస్తామన్నారు. ఈ నకిలీ మద్యంతో రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని నిలదీశారు. 2024 మే 24న గాంధీభవన్‌లో మంత్రి జూపల్లి మీడియా సమావేశంలో ఎలాంటి కంపెనీలు రాష్ట్రంలో కొత్తగా వ్యాపారం చేయడానికి ప్రతిపాదనలు పెట్టలేదని చెప్పా రు. అలా ప్రచారం చేసే మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని బెదిరించారు.

మే 27న బీఆర్‌ఎస్ జూపల్లి అబద్ధాలను బహిర్గతం చేస్తూ సోమ్ డిస్టల్లరీస్ అనే సంస్థకు అనుమతులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడంపై క్రిశాంక్ మీడియా సమావేశం నిర్వహించారు. దీనికి సమాధానంగా మంత్రి 28న లేఖ విడుదల చేసి సోమ్ అనే సంస్థకు అనుమతులు ఇవ్వ డం వాస్తవమని ఒప్పకున్నారని తెలిపారు. నకిలీ మద్యం కంపెనీకి అనుమతులపై కనీసం సమాచారం లేదని అనడం నిర్లక్ష్యమని క్రిశాంక్ ఆరోపించారు. ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్‌లో అబ్కారీ విభాగం సోమ్ సంస్థ నకిలీ మద్యం అమ్ముతున్నందుకు నోటీసులు ఇచ్చిందని, చైర్మన్ జగదీశ్ ఆరోరాను జైలుకు పంపిందని తెలిపారు.