ఆయిల్‌పామ్ సాగు లాభదాయకం!
ఖమ్మం ఏరియాలో పెరుగుతున్న మక్కువ
ఇప్పటికే 20వేల ఎకరాల్లో సాగుబడి
అవగాహన, ఆర్థిక సాయం అందిస్తే
మరింత పెరిగే అవకాశం
ఖమ్మం, మే 29 (విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మంతో పాటు పరిసరప్రాంతాలను ఆయిల్ పామ్ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రభు త్వం కృత నిశ్చయంతో ఉంది. అందు కు అనుగుణంగానే ఆయిల్‌పామ్ సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించడంతో రైతులు ఆసక్తి చూపు తున్నారు. చీడ, పీడల బెడద తక్కువగా ఉండటం, బైబ్యాక్ పద్ధతిలో ఉత్పత్తిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకోవడంతో రైతులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. 30 ఏళ్ల వరకు ఆదాయం లభించే అవకాశం ఉన్నందున రైతులు పంట మార్పిడి చేస్తున్నారు. వరిసాగు చేస్తున్న రైతులు సైతం ఆయిల్ పామ్ వైపు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ని 30 మండలాల్లో ఆయిల్ పామ్ సాగుచేశారు. 20 వేల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకోగా, నేషనల్ రీ అసెస్‌మెంట్ కమిటీ గుర్తించిన ఆయిల్‌పామ్ సాగుకు అనువైన భూములుగా గుర్తించిన ప్రాంతాల్లో పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు ఆరంబించారు. ఒక ఎకరం వరిని సాగు చేయగలిగే నీటితో 4 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయవచ్చని తెలుపుతున్నారు. ప్రత్యామ్నాయంగా ఈ పంట సాగు చేయడం మేలని చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మంతో పాటు సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో 38 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉన్నట్లు తేల్చారు.
సబ్సిడీ ఇలా...
ఆయిల్ పామ్ సాగుచేసే ఎస్సీ, ఎస్టీ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టం కోసం 100శాతం సబ్సిడీ ఇస్తున్నారు. బీ.సి. రైతులకు 90శాతం, ఇతరరైతులకు 80శాతం సబ్సీడి ప్రకటించారు. ఆయిల్ పామ్ సాగు మొదలుపెట్టాక 4సంవత్సరాలకు పంట దిగుబడి ప్రారంభం అవుతుంది. దీన్నిదృష్టిలో ఉంచుకుని రైతులకు నాలుగేళ్ల వరకు ఏడాదికి ఎకరాకు రూ.4,200 అందజేస్తారు. ఆయిల్పామ్ తోటల సాగుద్వారా 30ఏళ్ల వరకు ఆదాయం పొందవచ్చు.
5 పరిశ్రమల దస్త్రం పైనే తొలి సంతకం..
ఆయిల్‌పామ్ సాగు రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చుతుందని, రైతులు పామ్ సాగువైపు మెగ్గు చూపేందుకు అధికార యంత్రాంగం దిశానిర్దేశం చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే రాష్ట్రంలో 5 ఆయిల్ పామ్ పరిశ్రమలు స్థాపించే ఫైలుపై తొలి సంతకం చేశారు. ఇందుకోసం రూ.1,050 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. 2023 2024 నుంచి ఏటా 40 వేల ఎకరాల విస్తీర్ణం పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో 5 ఆయిల్‌పామ్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో 2 కర్మాగారాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, కల్లూరిగూడెంలలో ఏర్పాటు చేస్తున్నారు.
డ్రిప్ ఏర్పాటులో ఆంక్షలు పెట్టొద్దు
ఆయిల్ పామ్ తోట నాటినపుడే డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం ఇస్తాం. తరువాత డ్రిప్ కోరితే ఇవ్వము అనే అనే ఆంక్షలను ఎత్తివేయాలని పామ్ ఆయిల్ రైతు మాను కొండ రాధాకిషోర్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతుకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం వాటిల్లే తావు లేదని, వరి, మిర్చి పంటలు కళ్లాల్లో ఉండగా వర్షం కురిసినా నష్టాలు భరించాల్సిన పరిస్థితి ఉందని, పామ్‌ఆయిల్ గెల చెట్టుమీద ఉండగా వర్షం కురిసినా, కోసి పక్కకు స్టాక్ చేసినపుడు వర్షం పడ్డా ప్రమాదం లేదని స్పష్టం చేశారు. మద్దతు ధర ప్రస్తుతం టన్నుకు రూ.14,400 ఉంది.
రూ.15వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. ఎకరాకు 12 టన్నుల పంట ఉత్పత్తి అవుతుందని, మొదటి మూడు ఏళ్లు యూరియాతో పాటు పొటాష్, సూపర్ ఎరువులు ఉచితంగా అందజేస్తారని, రూ.140 విలువ గల పామాయిల్ మొక్కకు గాను రూ.30 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రముఖ కంపెనీ గోద్రెజ్ వారి ఆధ్వర్యంలో రఘునాథపాలెం, కొణిజర్ల, ఏన్కూరు, ఖమ్మం రూరల్, చింతకాని, వైరా తదితర మండలాలను దత్తతతీసుకుందని, గోద్రేజ్ కంపెనీ ద్వారానే పామాయిల్ మెక్కలు, ఎరువులు సరఫరా చేస్తారని తెలిపారు. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులు పామాయిల్ రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారని తెలిపారు. మానుకొండ రాధాకిషోర్






