రంజాన్ ఇఫ్తార్ విందులో మంత్రి జూపల్లి
16-03-2026 12:00 AM
కొల్లాపూర్ టౌన్ మార్చి 15నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని ఖాదర్ భాషా దర్గాలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన రంజాన్ ఇఫ్తార్ విందులో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ఉపవాసం, ఆత్మశుద్ధి, సహనం మరియు దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.
ముస్లిం సోదరులు పాటించే ఉపవాస దీక్ష నియంత్రణ, సేవాభావం, పరస్పర సహకారాన్ని పెంపొందిస్తుందన్నారు.హిందూ, ముస్లిం సహా అన్ని మతాల ప్రజలు గంగాజమునా తహజీబ్ స్ఫూర్తితో పరస్పర గౌరవంతో కలిసిమెలిసి పండుగలను జరుపుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.




