2 July, 2026 | 1:39 PM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం.. 20 మంది మహిళలు అరెస్ట్‌

02-07-2026 01:05 PM

హైదరాబాద్: ఒమన్ ఎయిర్ విమానంలో మస్కట్‌కు ప్రయాణించేందుకు ప్రయత్నించిన ఇరవై మంది మహిళలను శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Rajiv Gandhi International Airport) ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల దగ్గర నకిలీ వీసాలను స్వాధీనం చేసుకున్నారు. వలస శాఖ అధికారుల సమాచారం ప్రకారం, ఆ మహిళలు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారు.

 వారి వీసాలు నకిలీవని అనుమానం రావడంతో ఇమిగ్రేషన్ క్లియరెన్స్ ప్రక్రియలో(Emigration clearance process) వారిని అడ్డుకుని, విచారణ నిమిత్తం వెంటనే అదుపులోకి తీసుకున్నారు. తమకు నకిలీ వీసాల గురించి తెలియదని, ఒక ట్రావెల్ ఏజెంట్ ఆ పత్రాలను సమకూర్చాడని మహిళలు అధికారులకు చెప్పారు. ప్రయాణ పత్రాలన్నీ అసలైనవేనని ఆ ఏజెంట్ హామీ ఇచ్చారని, అలాగే ఒమన్‌కు ప్రయాణం, అక్కడ ఉద్యోగ ఏర్పాట్లు కూడా అతనే చేశాడని పేర్కొన్నారు. ఏజెంట్‌ను గుర్తించి, పట్టుకోవడానికి ఇమ్మిగ్రేషన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. తదుపరి విచారణ కోసం ఆ మహిళలను శంషాబాద్ విమానాశ్రయ ఔట్‌పోస్ట్ పోలీసులకు అప్పగించారు.