5 July, 2026 | 8:31 PM

అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష

11-06-2024 04:38 PM

వనపర్తి, విజయక్రాంతి: ప్రజలు మెచ్చే విధంగా, పారదర్శకమైన ప్రజాపాలన అందించేందుకు అధికారులు తమవంతు సహకారం అందించాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వనపర్తి జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన వీపనగండ్ల, చిన్నంబావీ, పానగల్ మండలాలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పై మంగళవారం వనపర్తి జిల్లా ఐ.డి. ఒ.సి సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రజలు మెచ్చే విధంగా పారదర్శకమైన ప్రజాపాలన అందించేందుకు కృత నిశ్చయంతో ఉందని అందుకు ఆయా శాఖల అధికారులు పూర్తి సహకారం అందించాలని సూచించారు. 

గ్రామాలలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలి

ముందుగా వైద్య ఆరోగ్య శాఖ పై సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రమైన తాగు నీరు, పరిశుభ్రత, వైద్య సదుపాయం అందుబాటులో ఉండాలని తెలిపారు. పరిశుభ్రమైన తాగు నీటిని అన్ని కుటుంబాలకు సమానంగా అందించే విధంగా ఆర్.డబ్లు.ఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలి.  గ్రామాల్లో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని, వచ్చిన నిధులను ఆయా గ్రామ పంచాయతీలకు ప్రతులు పంపించి పారిశుధ్య పనులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిదంగా వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు అంబులెన్స్ సౌకర్యం కల్పించండి. అవసరమైన నిధులను అందిస్తాం.  కలెక్టరేట్ నుండి పెట్రోల్, లూబ్రికెంట్, డ్రైవర్ ఖర్చులు భరిస్తామని సూచించారు. రేమద్దుల గ్రామంలో నిర్మించిన ఆరోగ్య కేంద్రాన్ని ఆధీనంలో తీసుకొని వైద్య సేవలు అందించేందుకు మల్టి లెవల్ హెల్త్ ప్రొవైడర్ డాక్టర్ ను నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కొరత ఉన్న సబ్జెక్టు టీచర్లను  నియమించేందుకు చర్యలు తీసుకోవాలి 

జిల్లాలో మొత్తం విద్యార్థులు ఎంతమంది, ఉపాద్యాయులు ఎంతమంది, ఉపాద్యాయులు ఖాళీలు ఎన్ని ఉన్నాయని విద్యా అధికారినీ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకు 54,306 మంది విద్యార్థులు, 2026 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, 364 ఖాళీలు ఉన్నట్లు  డి. ఈ. ఒ గోవిందరాజులు వివరాలు వెల్లడించారు. చిన్నంబావి, వీపనగండ్ల మండలాల్లో కొరత ఉన్న సబ్జెక్టు టీచర్లను  నియమించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.  పెద్దదగడ, పెద్ద మరూర్ లోని ప్రభుత్వ పాఠశాల, ఉన్నత పాఠశాల మొత్తం 4 పాఠశాలలకు కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.  కార్పొరేట్ పాఠశాలల్లో సైతం లేని విధంగా అన్ని వసతులు కల్పించాలని, వీటిని రెసిడెన్షియల్ పాటశాల మాదిరిగా ప్రత్యేక బోధన అందించేందుకు అవసరమైన ఉపాధ్యాయులను నియమించాలని, ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించేందుకు సైతం అవసరమైన నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేశారు.  వనపర్తి జిల్లాలోనీ అన్ని పాఠశాలలకు బాల బాలికలకు అవసరమైన మరుగుదొడ్లు రన్నింగ్ వాటర్ సౌకర్యం తో ఏర్పాటు కావాలని ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన పనులు చేసి  15 రోజుల తర్వాత  ఎక్కడా  మరుగుదొడ్ల సమస్య లేకుండా చూసుకోవాలని సూచించారు. పాఠశాలలను ప్రతిరోజూ పరిశుభ్రం చేయించే బాధ్యతను పంచాయతీ సెక్రటరీకి అప్పగించాలని సూచించారు. ప్రతి పాఠశాలలో పెద్ద సైజు చెత్తకుండీ ఏర్పాటు చేయాలని సూచించారు .  ఉపాధి హామీ ద్వారా పనులు చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ జాబ్ కార్డులు జారీ చేసి  పనిదినాలు పెంచాలని ఆదేశించారు.  లేబర్ కాంపోనెంట్ పెంచి మెటీరియల్ కపోనెంట్ అధికంగా  మంజూరు అయ్యే విధంగా  అవగాహన కల్పించాలని ఆదేశించారు. 

మంజూరు అయిన సిసి, బిటి రోడ్ల పనులు పూర్తి చేయాలి

సీసీ రోడ్లు, బి.టి రోడ్లు  మంజూరు అయిన వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ కార్యనిర్వహక ఇంజనీరు ను ఆదేశించారు.  టెండర్ అయి సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్లకు 60 సి సెక్షన్ కింద నోటీసులు జారీ చేయాలని, ఇంకా టెండర్లు పిలువని వాటికి వెంటనే టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు.  పని పూర్తి చేసిన వాటికి వెంటనే  మెజర్మెంట్ బుక్  పూర్తి చేసి ఎఫ్.టి. ఒ అప్లోడ్ చేయాలని సూచించారు. పాన్ గల్ నుండి కదిరేపాడ్ బి.టి రోడ్డు ను త్వరగా రెన్యువల్ చేయాలని అదేవిధంగా తుముకుంట పి. ఆర్ రోడ్డు, జడ్పి జటప్రోల్ వయా గోపలాపూర్ రోడ్డు ను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు అవసరమైన కుటుంబాలకు ఉపాధిహామీ పథకం కింద మరుగుదొడ్లు మంజూరు చేయాలని సూచించారు.  కిందిస్థాయి ఉద్యోగులకు వాట్సప్ ద్వారా తగిన సమాచారం ఇవ్వాలని అధికారులను సూచించారు.

రైతులకు ఇబ్బందులు గురి చేస్తే చర్యలు కఠినంగా ఉంటాయి

విద్యుత్ శాఖ ద్వారా రైతులకు ఇబ్బంది పెట్టే పని చేయవద్దని ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు కఠినంగా తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఎంతమంది రైతులు వ్యవసాయ కనెక్షన్ల కు దరఖాస్తు చేసుకున్నారు, వాటి పురోగతి ఎంటి అని విద్యుత్ అధికారులను ప్రశ్నించారు.  విద్యుత్ ఎస్.. ఈ లేకపోవడంతో విద్యుత్ సమస్యల పైన మూడు మండలాల నుండి వచ్చిన 24 ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ కు అప్పగిస్తూ సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి తీసుకోవాల్సిన చర్యల పై పూర్తిస్థాయి నివేదికను వారం రోజుల్లో ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను సూచించారు.  విద్యుత్ అధికారులు ప్రజల సమస్యలను వినడం లేదని పెడచెవిన పెడుతున్నారని వచ్చిన ఫిర్యాదు పై కలెక్టర్ స్పందించారు.   ప్రజలు తమ సమస్యలను  ఏ శాఖకు సంబంధించిన ఫిర్యాదులను ఇచ్చిన అధికారులు వినాలని వాటిని పరిష్కరించేందుకు అవసరమైతే  పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ఆదేశించారు.  పట్టించుకోకుంటే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు.

మంచి నీరు అందించక పోతే ఉపేక్షించేది లేదు

మిషన్ భగీరథ నిర్వహణ లోపం వల్ల శుభ్రమైన నీరు రావడం లేదని ఇది ఎంతమాత్రం ఉపేక్షించేది కాదని మంత్రి  అన్నారు. గోపాల్ దీన్నే రిజర్వాయర్ నుండి వీపనగండ్ల, పాన్ గల్, చిన్నంభావి మండలాలకు వచ్చే మిషన్ భగీరథ నీరు పచ్చగా వస్తున్నాయని, నిర్వహణ లోపం ఎక్కడుందని మిషన్ భగీరథ అధికారులను మంత్రి ప్రశ్నించారు. రేపటి నుండి జిల్లాలో పరిశుభ్రమైన నీరు రాకుంటే మాత్రం చర్యలు తీసుకోడానికి వెనుకాడమని  హెచ్చరించారు.

నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు గుర్తిస్తే అధికారులకు ఫిర్యాదులు చేయాలి 

జిల్లాలో విత్తనాలు, ఎరువుల నిల్వల పై వివరాలు అడిగితెలుసుకున్నారు.  విత్తనాలు, ఎరువులను కొరత లేదని ఎక్కడైనా నకిలీ విత్తనాలు అముతున్నట్లు రైతులు గుర్తిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదులు చేయాలని సూచించారు. 

పిర్యాదు పట్ల నిర్లక్ష్యం ఎందుకు

2022 సంవత్సరంలో  పాన్ గల్ మండలంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ తెగిపోవడం వల్ల ఒక రైతుకు చెందిన 45 మామిడి చెట్లు వేళ్ళతో సహా కొట్టుకుపోయిందని ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ఉద్యానవన శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులను నిలదీశారు.  ఇలాంటి నిర్లక్ష్యం పునరావృతం కాకుండా చూసుకోవాలని, వెంటనే పంట నష్టం అంచనా వేసి పంపించాలని ఆదేశించారు. 

అడ్డంకుల పై సమగ్ర నివేదిక వారం రోజుల్లో ఇవ్వాలి ...

భీమ, కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి ఇంకా ఎన్ని ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందని ప్రశ్నించారు.  700 ఎకరాలకు అవార్డు పాస్ చేయాల్సి ఉందని ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ భూసేకరణ సమాధానం ఇచ్చారు. భూసేకరణ కు సంబంధించి మొత్తం ఎంత మంది రైతులు, ఎన్ని ఎకరాలు వాటి సర్వే నెంబర్ తో సహా అవార్డు పాస్ చేసేందుకు ఉన్న అడ్డంకుల పై సమగ్ర నివేదిక వారం రోజుల్లో ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.  చిన్నంబావి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలు, చెల్లంపాడు గ్రామంలో 700 ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ఉన్న సమస్యల పూర్తి నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు.  అనంతరం రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రజల భూ సమస్యలు ఫిర్యాదుల పై ఫిర్యాదు వారీగా రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్, జిల్లా అధికారులు, ఆర్డీవో,  తహశీల్దార్లు, ఎంపీడీఓ లు, రైతులు,  తదితరులు పాల్గొన్నారు.