15 April, 2026 | 5:51 AM

మహిళా ఐఏఎస్‌పై దుష్ప్రచారం దురదృష్టకరం

10-01-2026 03:48 PM

మంత్రులనే కాదు.. సీఎంపైనా దుష్ప్రచారం

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: మంత్రులపై ఇటీవల వస్తున్న ఆరోపణలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) ఖండించారు. మంత్రులనే కాదు.. సీఎంపైనా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబాలను ఇబ్బంది పెట్టేలా రాతలు రాయొద్దని మంత్రి హితవు పలికారు. మహిళా ఐఏఎస్ పై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరం అన్నారు. ఎన్నికల తర్వాత నల్గొండకు నలుగురు కలెక్టర్లు మారారని తెలిపారు. తన జిల్లాలోనే కాదు.. చాలా జిల్లాల్లో కలెక్టర్ల బదిలీలు జరిగాయని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియకుండానే బదిలీలు జరుగుతాయని మంత్రి కోమటిరెడ్డి వివరించారు. కేవలం సీఎం, సీఎస్ మాత్రమే అధికారులను బదిలీ చేస్తారని చెప్పారు. కలెక్టర్ల బదిలీలు, పదోన్నతులు సర్వసాధారణమన్నారు. అధికారుల మీద అభాండాలు వేయడం సరికాదని హెచ్చరించారు. రేటింగ్ లు, వ్యూస్ కోసం దుష్ప్రచారం చేయొద్దని తెలిపారు. అధికారుల కుటుంబాల గౌరవం గురించి కూడా ఆలోచించాలని కోరారు.

సినిమా పరిశ్రమపై ఇంకా దృష్టి పెట్టలేదు: మంత్రి కోమటిరెడ్డి

సినిమా పరిశ్రమపై ఇంకా దృష్టి పెట్టలేదని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పుష్ప సినిమా తర్వాత బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదని చెప్పిన విషయాన్ని పునరుద్ఘాటించారు. బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు కోసం తన వద్దకు రావొద్దని చెప్పానన్నారు. టికెట్ల ధరలు పెంపు సంబంధించి ఏ ఫైల్ తన దగ్గరకు రాలేదని చెప్పారు. బెనిఫిట్ షోల కోసం తనను ఎవరూ సంప్రదించలేదని వెల్లడించారు. సంధ్య థియేటర్ బాధిత కుటుంబానికి రూ. 25 లక్షలు అందించామన్నారు. బాధిత బాలుడిని చదివిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు.