14 April, 2026 | 8:10 PM

కొండంత పని చేస్తున్నాం.. గడప గడపకూ చెప్పండి!

14-04-2026 04:33 PM

- అధికారం లేక విపక్షం విలవిల.. నిప్పు తొక్కిన కోతుల్లా ప్రవర్తన

- ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం

- కాంగ్రెస్‌ కార్యకర్తల కృషితోనే ప్రజా పాలన సాధ్యం

- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉద్ఘాటన

ఖమ్మం,(విజయక్రాంతి): "గత పాలకులు గోరంత చేసి కొండంత చెప్పుకున్నారు.. కానీ మన ప్రభుత్వం కొండంత అభివృద్ధి చేస్తున్నా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెనుకబడి ఉన్నాం. కార్యకర్తలు నడుం బిగించి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని ప్రతి ఇంటికీ వివరించాలి" అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన జిల్లా, నగర కాంగ్రెస్ నూతన కార్యవర్గ బాధ్యతల స్వీకరణ మహోత్సవంలో ఆయన మాట్లాడారు.

కార్యకర్తలే ఈ ప్రభుత్వానికి పునాది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కొనసాగుతున్నది కార్యకర్తల ప్రభుత్వమని పొంగులేటి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే తపనతో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని చెప్పారు. కార్యకర్తల కష్టం, పోరాట ఫలితంగానే నేడు మనం అధికారంలో ఉన్నామని, ఆ బాధ్యతను గుర్తెరిగి ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు.

ప్రతిపక్షాల మాయమాటలను తిప్పికొట్టాలి

పదేళ్లపాటు రాష్ట్రాన్ని ఏలిన వారు అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి విమర్శించారు. అధికారం పోయిందన్న కసితో నిప్పు తొక్కిన కోతుల్లా ఎగురుతున్నారని, వారి మాయ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు. మనం చేసిన అభివృద్ధిని, అందిస్తున్న సంక్షేమాన్ని గడప గడపకూ వివరించగలిగితే కాంగ్రెస్ విజయ పరంపరను ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.

వేడుకగా ప్రమాణ స్వీకారం

పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా, నగర కాంగ్రెస్ నూతన కార్యవర్గ సభ్యులు ఉత్సాహంగా బాధ్యతలు చేపట్టారు. డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామదాస్ నాయక్, మట్టా రాగమయి దయానంద్‌, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.